అబిడ్స్, జనవరి 1: ఉన్నతమైన ఆలోచనలతో మొదలైన నుమాయిష్‌కు ప్రపంచ ప్రపంచస్థాయిలో గుర్తింపు ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్ సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్, ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిశ్రమల నిర్వాహకులు ఉత్పత్తులను తీసుకువచ్చి ఇక్కడ ప్రదర్శించడంతో పాటు విక్రయాలు చేపడుతున్నారన్నారు. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని, నగరంతో పాటు దేశంలోని నలుమూలల నుంచి సందర్శకులు నుమాయిష్‌ను సందర్శిస్తారని తెలిపారు.
ఎగ్జిబిషన్ ఆదాయంతో నిరుపేదలకు విద్య..
మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ అంటే ఇక్కడ వ్యాపారాలు నిర్వహించడమే కాదని, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి మార్కెటింగ్ చేసుకునేందుకు వేదిక అన్నారు. ఎగ్జిబిషన్.. వివిధ రాష్ర్టాలకు చెందిన విభిన్న సంస్కృతులు, ఉత్పత్తుల కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు వేదికగా తయారైందన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో 19 విద్యా సంస్థలు కొనసాతూ 30 వేల మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ 4 వేల మందికి జీవనోపాధి కల్పిస్తోందన్నారు. అనంతరం మినీ ట్రైన్‌ను ప్రారంభించి అందులో నుమాయిష్‌ను చుట్టుముట్టారు. జైళ్ల శాఖ స్టాల్‌ను ప్రారంభించి ఉత్పత్తులను పరిశీలించగా అధికారి సౌమ్య మిశ్రా వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్ సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి టీ చంద్రశేఖర్, కోశాధికారి ఎన్ సంజీవ్‌కుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు అశ్వక్ హైదర్, పీ నరోత్తంరెడ్డి, ఎన్ వినయ్‌కుమార్, డాక్టర్ బీ ప్రభాకర్, బి హనుమంతరావు, యం చంద్రశేఖర్, ఎల్ మంజిత్ రెడ్డి, యాసర్ అరాఫత్, డాక్టర్ శైలజారాజ్, అనురాగ్ మిశ్రా, ధీరజ్ జైస్వాల్, పబ్లిసిటీ సబ్ కమిటీ అడ్వైజర్ వి ప్రద్యుమ్న, కన్వీనర్ డి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.