బంజారాహిల్స్, జూలై 5 : ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఖరీదైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ డిమాండ్ చేశారు. శనివారం ఫిలింనగర్‌లోని తన కార్యాలయంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరునెలలుగా షేక్‌పేట మండలంలోని పలు బస్తీలు, కాలనీల్లో ప్రభుత్వ స్థలాలను కాజేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నామమాత్రపు కేసులతో అధికారులు పరోక్షంగా కబ్జాలకు సహకరిస్తున్నారని ఆరోపించారన్నారు. ప్రభుత్వ స్థలాలను కాపాడడంలో అధికారుల పాత్రతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల భాధ్యత ఉంటుందని పేర్కొన్నారు. కబ్జాలకు పాల్పడుతున్నవారిపై కఠినమైన కేసులు నమోదు చేయాలని, రాజకీయ నేతల ఒత్తిళ్లకు లొంగవద్దని అధికారులను కోరారు.