సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నేడు నోటిఫికేషన్ జారీ కానున్నది. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఈ మేరకు మంగళవారం బల్దియా షెడ్యూల్ వివరాలను వెల్లడించింది. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఇద్దరు కార్పొరేటర్లు చనిపోగా..మరో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. 146 మంది కార్పొరేటర్లు 15 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ నెల 10 నుంచి 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆదివారం (16వ తేదీ మినహా) మిగిలిన రోజుల్లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
ఔత్సాహికులు ఎన్నికల విభాగం అదనపు కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. 18న నామినేషన్ల పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ, ఆదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల ప్రకటనను అధికారులు విడుదల చేయనున్నారు. ఈ నెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్, కౌంటింగ్ మూడు గంటల తర్వాత ఉండనుందని పేర్కొన్నారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవమవుతున్నదని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకు బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికల ఏడాది కావడంతో ఎన్నికలు జరుగుతాయా? ఏకగ్రీవం అవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.