వెంగళరావునగర్, జూలై 27: నిబంధనలు పాటించని శ్రీనగర్ కాలనీలోని నిఖిల్ దవాఖానకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. యూసుఫ్‌గూడకు చెందిన యువతి(17) ఏడాదిన్నర కాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆదివారం ఉదయం అపస్మారకస్థితిలో ఉన్న బాలికను చికిత్స కోసం నిఖిల్ హాస్పిటల్‌కు కుటుంబీకులు తీసుకొచ్చారు.
బాలికను వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం రోగి మృతి పై పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా..దవాఖాన ఆ నిబంధనల్ని బేఖాతర్ చేసింది.యూసుఫ్‌గూడలో ఓ యువతి మృతి చెందినట్లు తెలుసుకున్న స్థానిక మధురానగర్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలోని పోలీసులు దవాఖానకు చేరుకుని వైద్యులు, సిబ్బందిని ప్రశ్నించారు.
తమ దవాఖాన ఎండీ అందుబాటులో లేరని..ఆయన వచ్చాక రావాలని సిబ్బంది నిర్లక్ష్యంగా బదులిచ్చారు.డెత్ సమ్మరితో పాటు స్థానిక పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని అప్పగించినట్లు తమకు సమాచారం ఉందని..బాలిక మృతి పై మరణ వాంగ్మూలం తెలపాల్సిందిగా పేర్కొంటూ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ నిఖిల్ హాస్పిటల్ ప్రవేశ ద్వారానికి నోటీసు అంటించి వెళ్లిపోయారు. ఈ విషయమై నిఖిల్ దవాఖానను సంప్రదించగా ఆదివారం కావడంతో తమ ఎండీ అందుబాటులో లేరని సోమవారం రావాలని అక్కడి సిబ్బంది తెలిపారు.