Jalamandali | సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ఇంకుడు గుంత లేని ఇండ్లకు నోటీసులు జారీ చేయాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి జలమండలి చేపట్టిన 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌పై సమీక్షించారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు.
మ్యాన్‌హోళ్లలో తీసిన వ్యర్థాలను (సిల్ట్) డంపింగ్ యార్డుకు తరలించాలని, డ్రై బోర్‌వెల్స్‌పై కొనసాగుతున్న సర్వేను వేగవంతం చేయాలని చెప్పారు. వినియోగదారులు తమ ఇళ్లల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని..లేకపోతే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. వచ్చే జనవరి నుంచి ట్యాంకర్ బుక్ చేస్తే అదనపు చార్జీలు వసూలు చేస్తామన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపించడంతో పాటు నేరుగా వారికి పత్రాలు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు వీఎల్ ప్రవీణ్‌కుమార్, స్వామి, విజయరావు, సీజీఎంలు పాల్గొన్నారు.