సిటీబ్యూరో: బదిలీ అయినా..బల్దియాలోనే ఉంటామంటున్నారు కొందరు అధికారులు. ఒక్కసారి బల్దియాలో పోస్టింగ్‌లోకి వస్తే చాలు.. తిరిగి బదిలీపై వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. రెగ్యులర్ ఉద్యోగులే కాదు.. రిటైర్డ్ ఉద్యోగులు సైతం పైరవీలతో తిరిగి తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం పరిపాటిగా మారింది. అలా పదవీ విరమణ చేసి ఎక్స్‌టెన్షన్‌పై నేటికీ కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పురపాలక శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగాయి. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్లు, అదనపు కమిషనర్లు, జాయింట్ కమిషనర్లతో పాటు గ్రేడ్ 1, 2, 3లకు చెందిన 24 మందికి స్థానచలనం కల్పిస్తూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రక్రియలో భాగంగా జీహెచ్ఎంసీలోని 12 మందికి కూడా స్థానచలనం కలిగింది. వీరిలో ఇద్దరు మహిళా జాయింట్ కమిషనర్లు మెడికల్ నిబంధనలు పెట్టి.. ట్రాన్స్ఫర్ అయిన చోట రిపోర్టు చేయకుండా బల్దియాలోనే కొనసాగుతున్నారు. అంతేకాకుండా జూబ్లీహిల్స్, యూసీడీ విభాగం, ప్రధాన కార్యాలయంలో జాయింట్ కమిషనర్ ఒకరు పైరవీలతో మళ్లీ జీహెచ్ఎంసీలోనే కొనసాగేలా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ప్రజాప్రతినిధుల సిఫారసులతో కమిషనర్ ఆమ్రపాలిపై ఒత్తిడి పెంచుతున్నారు.
కమిషనర్ సైతం ప్రభుత్వ స్థాయిలో జరిగిన బదిలీలపై తాను నిర్ణయం తీసుకోలేనని, ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ అడ్డదారిలో కొనసాగేందుకు డిప్యూటీ కమిషనర్లు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చిన వారికి సైతం నేటికీ పోస్టులు ఇవ్వలేదు. పోస్టింగ్‌పై స్పష్టత లేకపోవడంతో వారంతా 13 రోజులుగా ఆఫీసుకు రావడం, తిరిగి ఇంటికి వెళ్లడం చేస్తున్నారు.