Ibrahimpatnam Lake | ఇబ్రహీంపట్నం, మార్చి 12 : ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పూడికతీత పనులు, పెద్దకాల్వ, రాచకాల్వల మరమ్మత్తుకు కోట్లాది రూపాయల నిధులు కేటాయించి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మరమ్మత్తు పనులు చేయించారు. గతంలో పూర్తిగా ఎండిపోయిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గత రెండేళ్లక్రితం కురిసిన భారీ వర్షాలకు అలుగుపారి నీటితో కళకళలాడింది.
పెద్దచెరువు నీటితో నిండటం ద్వారా ఇబ్రహీంపట్నం, శేరిగూడ, రాందాస్పల్లి, ఉప్పరిగూడ, పోచారం, తుర్కగూడ, కర్ణంగూడ, చర్లపటేల్గూడ, కప్పాడు, ఎలిమినేడు, మంగల్పల్లితో పాటు చెరువు చుట్టూ సుమారు 50 కిలోమీటర్ల దూరంలో భూగర్భజలాలు నీటిమట్టం పెరిగి రైతుల బోరుబావుల్లో నీరుచేరి వ్యవసాయానికి గత రెండేళ్లుగా ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు.
అలాగే, మత్స్యకారులు చేపపిల్లలు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. గత ప్రభుత్వ హాయాంలో నీటితో కళకళలాడిన పెద్దచెరువు ప్రస్తుతం ఎండుముఖం పడుతుండటంతో ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మా జీవితాలను శాసించే పెద్దచెరువు ఎండిపోతే మా బ్రతుకు మల్లా బజారున పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పూర్తిగా ఎండిపోయిన చెరువును.. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో పూడికతీత పనులు, వాగులు, కాల్వల మరమ్మత్తు పనులతో చెరువు పూర్తిగా నిండి సుమారు 30ఏండ్ల తర్వాత అలుగు పారింది.
గత రెండేళ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించిన ఈ ప్రాంత రైతులు, మత్స్యకారులు చెరువు ఎండుముఖం పడుతుండటంతో లబోదిబోమంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటే ఇప్పటికే ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా నీరంది పుష్కలంగా నీరుండేది. గతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇబ్రహీంపట్నం పెద్దచెరువును నీటితో నింపి ఎప్పుడు కళకళలాడే విధంగా కృషిచేసేందుకు రాచకొండ ఎత్తిపోతల పథకం ద్వారా నీటితో నింపుతానని హామీ ఇచ్చారు. ఈ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే నూరుకు నూరుశాతం పెద్దచెరువుకు నీరు చేరేదని బీఆర్ఎస్ నాయకులు తెలుపుతున్నారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో చెరవుకు నీరు కాదుకదా.. నియోజకవర్గంలో ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు.