హైదరాబాద్ : మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని మల్లారెడ్డి విశ్వవిద్యా పీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి చెప్పారు. 2022లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ పీజీ సీట్ల విషయంలో తమ కళాశాలపై వేసిన కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు వచ్చారని, విచారణలో భాగంగా నోటీస్ ఇచ్చారని ఆమె తెలిపారు.
ఉదయం 6 గంటలకు పోలీసులు రావడంతో ఐటీ అధికారులు వచ్చినట్లు ప్రచారం జరిగిందని, కానీ అది నిజం కాదని ప్రీతిరెడ్డి చెప్పారు. తమ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అన్ని సక్రమంగా జరిగాయని, ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో అవకతవకలు జరగకుండా చూడటంలో మల్లారెడ్డి యూనివర్సిటీ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.