Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మూడు రోజుల కిందట జరిగిన ఖజానా జ్యువెల్లరీ, కేపీహెచ్బీలో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన దోపిడీ.. దొంగతనాల కేసుల్లో నిందితుల ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. సీసీ పుటేజీలు, పాత నేరస్తుల డేటాను విశ్లేషించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుస్తోంది. దేశంలోని ఆయా రాష్ర్టాల్లోని ముఠాలకు మహానగరం సేఫ్ జోన్‌గా మారింది.
రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ రెండు ఘటనలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, నిరంతరం రయ్య్ మంటూ చక్కర్లు కొట్టే పోలీసు గస్తీ ఇవన్నీ ఉన్నా.. వరుస ఘటనలు చోటుచేసుకోవడం.. నిందితుల జాడ కనిపెట్టలేకపోవడం కలవరపెడుతున్నది.
దారి చూపని సీసీ ఫుటేజీలు..
చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ ఘటనలకు సంబంధించి ఘటన స్థలి పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు సైతం అనుకున్నంత మేర దారి చూపలేకపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ రెండు వేర్వేరు ఘటనలకు పాల్పడిన ముఠాలు కర్ణాటక లేదా మహారాష్ట్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్‌కు చెందినవిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రంగంలోకి దిగిన 12 బృందాల్లో కొన్ని బృందాలు మూడు రాష్ర్టాలకు వెళ్లినట్లు సమాచారం. నేర స్వభావం ఆధారంగా పోలీసులు స్వరా్రష్ట్రంతో పాటు అనుమానిత రాష్ర్టాల్లో స్థానిక పోలీసులతో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. క్లూస్‌టీమ్ నివేదికలు, కాల్పులకు సంబంధించిన బుల్లెట్ ఆధారంగా పోలీసులు నిందితుల ఆచూకీపై అంచనాలు వేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ర్టాలకు వెళ్లిన బృందాలు స్థానిక పోలీసుల సహకారంతో నిందితుల ఆచూకీని కనుక్కొనే పనిలో ఉన్నట్లు సమాచారం.
అంబర్‌పేట వృద్ధ దంపతుల కేసు..
2024 అక్టోబర్‌లో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అంబర్‌పేటలో జరిగిన వృద్ధ దంపతుల కేసులో సైతం దాదాపు 11 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఆ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. అంబర్‌పేటలోని సాయినగర్ కాలనీలో నివాసముండే లింగారెడ్డి, ఊర్మిల అనే వృద్ధ దంపతుల ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో దుండగులు చొరబడి వారిని కత్తులతో దారుణంగా హత్యచేసి దోపిడీకి పాల్పడిన ఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు పురోగతి లేదు.
వీడని అఫ్జల్‌గంజ్ కాల్పు ఘటన మిస్టరీ..
బీదర్‌లో ఏటీఎంను దోచుకున్న దొంగల ముఠా అక్కడి పోలీసుల నుంచి తప్పించుకొని వచ్చి నగరంలో తలదాచుకుంది. సమాచారం అందుకున్న బీదర్ పోలీసులు నగరానికి చేరుకుని దొంగల ముఠా కోసం వేట మొదలు పెట్టారు. అయితే నిందితులు మరో ప్రాంతానికి పరారయ్యే క్రమంలో అఫ్జల్‌గంజ్‌లో ఒక ప్రైవేటు బస్సు ఎక్కారు. అయితే ముఠా సభ్యులకు సంబంధించిన లగేజీ బ్యాగుల్లో నోట్ల కట్టలు కనిపించడంతో ట్రావెల్స్ మేనేజర్ వారిని అనుమానంగా చూడడంతో దోపిడీ దొంగలు వెంటనే మేనేజర్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన జరిగిన దాదాపు 11 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు.