సిటీబ్యూరో , అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 2వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు గురువారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు సింగూరు ఫేజ్-3లోని రిజర్వాయర్‌కు నీటి సరఫరా నిలిచిపోనున్నది.
ఈ ప్రభావంతో డివిజన్ 9, 15, 24 డివిజన్ల పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంఐజీ, బీహెచ్ఈఎల్ ఎల్ఐజీ, చందానగర్, పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, నల్లగండ్ల, హుడా కాలనీ, గోపన్‌పల్లి, లింగంపల్లి, గుల్మహర్ పార్కు, నెహ్రూనగర్, గోపీనగర్, దూబే కాలనీల్లో 24 గంటల పాటు నీటి సరఫరా ఉండదని అధికారులు పేర్కొన్నారు. గోపాల్‌నగర్, మయూరి నగర్, మాదాపూర్, ఎస్ఎంఆర్, గోకుల్‌ఫ్లాట్స్, మలేషియా టౌన్షిప్, బోరబండ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో లోప్రెషర్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంతరాయాన్ని వినియోగదారులు దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకుని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.