సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పడకేసిన అభివృద్ధితో ప్రాజెక్టులు లేక వెలవెలబోతుంటే… ఇప్పటివరకు విడుదల చేసిన టీడీఆర్‌లకు డిమాండ్ లేకుండా పోయింది. జీహెచ్ఎంసీ తరహాలో హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి 8 నెలలు గడిచినా.. క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. కోర్ సిటీలోని టీడీఆర్‌లకు ఉన్నంత ఆదరణ హెచ్ఎండీఏ జారీ చేసిన బాండ్లకు రావడం లేదు. ఇక గడిచిన రెండేండ్ల కాలంలో నగరంలో అభివృద్ధి పనులు ఏవీ లేకపోవడంతో కొత్తగా టీడీఆర్లూ జారీ కాలేదు. ఇక ఇప్పటివరకు జారీ అయిన వాటిని కొనేందుకు కూడా జనాలు మొగ్గుచూపడం లేదు.
హెచ్ఎండీఏ పరిధిలో టీడీఆర్ బ్యాంక్‌ను ఎనిమిది నెలల కిందట అందుబాటులోకి వచ్చింది. డిజిటలైజ్ టీడీఆర్, లెడ్జర్ వంటి సదుపాయాలతో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్లాట్‌ఫాంను రూపొందించారు. దీని ద్వారా భూసేకరణలో ఆస్తులను కోల్పోయిన బాధితులకు పారదర్శకంగా పరిహారాన్ని పొందేలా, క్రయవిక్రయాలకు వీలుగా టీడీఆర్ పోర్టల్‌ను ఏర్పాటు చేసినా జీహెచ్ఎంసీ తరహాలో లావాదేవీల్లో జరగడం లేదు. అయితే కోల్పోయిన స్థలం మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు టీడీఆర్‌లు పొందే వీలు ఉండగా, ఆన్లైన్లోనే భూ నిర్వాసితులు క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా పొందిన టీడీఆర్ సర్టిఫికేట్ల వివరాలను తెలుసుకునే వీలు కల్పించారు.
మార్కెట్లో హెచ్ఎండీఏ ఇప్పటివరకు జారీ చేసిన 84 టీడీఆర్‌లకు ఆదరణ రావడం లేదు. 11 జిల్లాల వరకు హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడా వినియోగించుకునే వెసులుబాటు ఉన్నా… కొనుగోలుదారులు మాత్రం బల్దియా విడుదల చేసే సర్టిఫికెట్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పాటు కొత్త టీడీఆర్‌ల జారీ కూడా లేకపోవడంతో ప్రాజెక్టు కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో హెచ్ఎండీఏ కూడా చేపట్టిన భారీ ప్రాజెక్టులు ఏవీ లేవు. దీంతోనే గతంలో భూసేకరణ జరిగి బాధితులకు మాత్రమే అందజేయగా… కొత్తగా ఈ రెండేళ్లలో జారీ కాలేదు. కనీసం ప్రతిపాదిత ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో హెచ్ఎండీఏ విఫలం కావడంతో… టీడీఆర్లూ రావడం లేదు. దీంతోనే 8 నెలల కాలంగా హెచ్ఎండీఏ టీడీఆర్ బ్యాంక్‌లో లావాదేవీలు లేకుండా బోసిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు.