Nizampet | దుండిగల్, డిసెంబర్1: నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పాటైన కొత్తలో కార్పొరేషన్ పరిధిలోని మూడు జంక్షన్లను బ్యూటీఫికేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో రూ.20 లక్షలను కేటాయించారు. అయితే మిగతా రెండు చోట్ల కాదని ప్రగతినగర్‌లోని బతుకమ్మ కుంట వద్ద గ్లోబల్ మ్యాపు వంటి ఓ ఆకృతి (గ్లోబల్ ఐడల్)ని ఆరు నెలల కిందట ఏర్పాటు చేశారు. కనీసం రూ.3 లక్షలు కూడా ఖర్చు చేయని ఈ ఆకృతి..ఏర్పాటు కోసం రూ.12 లక్షలను ఖర్చు చేశారు.
అయితే అప్పటికే కార్పొరేషన్ ఖజానా నిండుకోవడంతో ఆ ఆకృతి అవసరం లేదని పాలకవర్గం సభ్యులు ఎంతచెప్పినా.. వినని ఎస్ఈ.. తన పంతం నెగ్గించుకునేందుకు ఆ ఆకృతిని ఏర్పాటు చేశారు. అది కూడా తనకు నచ్చిన ఓ గుత్తేదారికి కొటేషన్పైనే పనులు అప్పగించారు. తీరా చూస్తే బతకుమ్మఘాట్ వద్ద ఆ ఆకృతి ఏర్పాటుతో తీవ్ర అంతరాయం కలుగుతుందని ఇటీవల తొలగించారు. ప్రస్తుతం ఆ ఆకృతి ఎందుకు పనికిరాకుండా కార్పొరేషన్ కార్యాలయం మైదానంలో మూలనపడేశారు.