సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి నిత్య పంచామృతాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఎల్లమ-పోచమ్మ దేవస్థాన ఈఓ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలో ప్రతి ఉదయం 5 నుంచి 6గంటల వరకు ఎల్లమ్మ అమ్మవారికి పంచామృత ప్రత్యేకాభిషేకాలు జరుగుతాయని పేర్కొన్నారు. 6 నుంచి 6.30 గంటల వరకు ప్రత్యేక పుష్పాలంకరణ, 6.45 గంటల వరకు బాలభోగము పంచహారతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అనంతరం అమ్మవారి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని చెప్పారు. అభిషేకంలో పాల్గొనే భక్తులు ముందు రూ.200 చెల్లించి అమ్మవారి అభిషేక ప్రసాదాన్ని స్వీకరించాలని సూచించారు. ప్రతిరోజు 11.30గంటలకు మహానివేదన, సాయంత్రం 7గంటలకు ప్రదోశకాల నివేదన జరుగుతుందని తెలిపారు. భక్తులందరూ సమయపాలన పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.