సిటీబ్యూరో, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : న్యూట్రాస్యూటికల్ అధ్యయనంలో జాతీయ పోషకాహార సంస్థ కీలక బాధ్యతలు నిర్వహించనున్నది. యునానీ మెడిసిన్ కోసం అవసరమైన మూలికలు, మందుల తయారీలో ఎన్ఐఎన్ కూడా పరిశోధనలు చేయనున్నది. ప్రకృతి సిద్ధంగా దొరికే మూలికలతో యునానీ మందులను తయారు చేస్తుండగా, వీటిని దీర్ఘకాలిక వ్యాధుల్లోనూ ఎక్కువగా వాడుతున్నారు. ఇటీవల కాలంలో ఆయుర్వేద, యునానీ మందుల వినియోగం పెరుగుతున్న క్రమంలో జాతీయ పోషకాహార సంస్థతో కుదిరిన ఒప్పందం కీలకంగా మారింది.
ఈ క్రమంలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునానీ మెడిసిన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం రోగాల నియంత్రణ, థెరపీలో వినియోగించే ఔషధాలపై ఎన్ఐఎన్ పరిశోధకులు కూడా అధ్యయనం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇకపై న్యూట్రాస్యూటికల్స్ పరిశోధనల్లో డైరెక్టర్ జనరల్ డా. జహీర్ అహ్మద్, ఎన్ఐఎన్ డైరెక్టర్ డా. హేమలత ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. ప్రస్తుతం వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో ఉండే పోషక, ఔషధ గుణాలపై ఎన్ఐఎన్ కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేస్తున్నది. ఇటీవలే దాల్చిన చెక్కలో దాగి ఉన్న క్యాన్సర్ నియంత్రణ ఔషధ గుణాలను వెలుగులోకి తీసుకొచ్చింది.