సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన నిమ్స్ దవాఖానలో క్యాన్సర్ బాధిత పిల్లల కోసం ప్రత్యేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడున్న ఆంకాలజీ విభాగంలో పిల్లలకు సంబంధించిన క్యాన్సర్ వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ కన్సల్టేషన్ కోసం జనరల్ ఓపీ ద్వారా పెద్దలతో పాటే రావల్సి వచ్చేది. దీంతో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చేందుకు వీలుండేదికాదు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు సంబంధించి ప్రతి రోజు కనీసం 100మంది వరకు ఓపీ సేవల కోసం వస్తుంటారు. దీంతో క్యాన్సర్ బాధిత పిల్లలకు గంటల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. దీనిని అధిగమించేందుకు పిల్లల కోసం ప్రత్యేక క్లినిక్‌ను నిమ్స్ అధికారులు శనివారం ప్రారంభించారు.
వారంలో రెండు రోజులు పీడియాట్రిక్ క్యాన్సర్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. శని, బుధవారాల్లో 18ఏండ్ల లోపు ఉన్న క్యాన్సర్ బాధిత, అనుమానిత పిల్లలకు ప్రత్యేకంగా కన్సల్టేషన్ అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ క్లినిక్ అందుబాటులో ఉంటుందని, రోగుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు అవసరమైతే మరో గంట అదనంగా సేవలు అందించనున్నట్లు ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు తెలిపారు.
మొన్నటి వరకు ఉన్న సేవల్లో కౌన్సెలింగ్ సదుపాయం లేదు. ప్రస్తుతం ప్రారంభమైన పీడియాట్రిక్ క్యాన్సర్ క్లినిక్ ద్వారా కన్సల్టేషన్తో పాటు కౌన్సెలింగ్ సైతం నిర్వహించనున్నారు.
నిరుపేద రోగులకు ఆర్థిక సలహాలు కూడా ఈ క్లినిక్‌లో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సీఎంఆర్ఎప్, పీఎంఆర్ఎఫ్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలకు సంబంధించిన వివరాలు, వారిని సంప్రదించే ప్రక్రియ, దవాఖాన నుంచి సహకారం తదితర అంశాల ద్వారా రోగులకు ఆర్థిక సలహాలు అందించి వారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందేందుకు పరోక్షంగా దోహదం చేయనున్నట్లు డాక్టర్ సదాశివుడు తెలిపారు.
డాక్టర్ సదాశివుడు, ఆంకాలజీ విభాగాధిపతి, నిమ్స్ దవాఖాన పీడియాట్రిక్ క్యాన్సర్ క్లినిక్ ద్వారా క్యాన్సర్ బాధిత పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా వారికి, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ద్వారా వ్యాధిపై అవగాహన కల్పించే వీలుంటుంది. ముఖ్యంగా బాధిత పిల్లలకు రోజువారి ఓపీలో ఎదురయ్యే నిరీక్షణ తప్పుతుంది. ప్రత్యేక రోజుల్లో కేవలం పిల్లలకు మాత్రమే ప్రత్యకే సేవలు అందించడం వల్ల వారిపై ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. పిల్లలకు సంబంధించి ప్రధానంగా మూడు రకాలు కేసులు వస్తున్నాయి. అందులో ఎక్కువగా లుకేమియా, బోన్ ట్యూమర్ తదితర కేసులు వస్తుంటాయి. వీటికి సంబంధించి లింపోమాతో పాటు ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్నాయి. నిమ్స్‌లో ఒకేసారి 7మందికి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్స్ చేయడం దేశంలోనే తొలిసారి.