వేగంగా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడంతో పాటు ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూకు మొగ్గు చూపింది. దీంతో నగర జీవి తన దైనందిన జీవనంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ విధించడంతో ఇకపై నగరంలో నైట్ బజార్లు బంద్ కానున్నాయి. క్లబ్లు, పబ్లు, థియేటర్లు మూతపడనున్నాయి. మెట్రో, సిటీ బస్సుల వేళల్లోనూ మార్పులు జరిగాయి. ఇకపై ప్రతి ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మెట్రో సేవలు రాత్రి 7.45 గంటలకు ముగియనున్నాయి. ఇక సిటీ బస్సులు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు అన్ని డిపోల నుంచి బయలుదేరి రాత్రి తొమ్మిది లోపుగమ్యస్థానాలకు చేరుకోనున్నాయి. దీంతో రాత్రి ప్రయాణాలకు బ్రేకులు పడనున్నాయి.
చాలా మంది ఉద్యోగులు తమ విధులు ముగించుకుని రాత్రి సమయాల్లోనే ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకుంటారు. రాత్రిపూట ఇంటికి చేరుకుని తెల్లారి మరో షిఫ్ట్నకు ఉద్యోగానికి హాజరయ్యే వాళ్లు ఎందరో. అయితే కర్ఫ్యూతో ఆ పరిస్థితికి బ్రేకులు పడింది. రాత్రి 9 గంటల తర్వాత బస్సులు బంద్ కానున్నాయి. ఇకపై వారి ప్రయాణాల్లో మార్పులు చేసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు కూడా తమ ప్రయాణాలను అత్యవసరమైతే తప్ప పెట్టుకోకూడదు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.