సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): శరీరంలోని ఏ ఒక్క భాగం కూడా బయటకు కనబడనీయకుండా ముసుగు దొంగ డ్రెస్సింగ్.. తాను ఉంటున్న ఐదు కిలోమీటర్ల పరిధిలో ఒక్కచోట కూడా తన వాహనం ఆపకుండా.. ఏ ఒక్కరిని కూడా పలుకరించకుండా.. తనదైన శైలిలో పాస్టర్ ముసుగు వేసుకొని కొన్నేండ్లుగా డ్రగ్స్ దందా చేస్తున్న నైజీరియన్ డేవిడ్ ఉకా అలియాస్ పాస్టర్‌ను ‘3’ అనే అక్షరం పట్టించింది. అతడిని పట్టుకోవడానికి తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీ న్యాబ్) భారీ ఆపరేషన్ నిర్వహించింది. డిమాండ్, సైప్లె చైన్ లింక్‌ను ఎక్కడికక్కడ తెగ్గొట్టి.. తెలంగాణకు డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు ప్రతి నెట్‌వర్క్‌పై టీన్యాబ్ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే గోవా, ముంబై.. తరువాత బెంగళూర్ నెట్‌వర్క్‌పై టీ న్యాబ్ ఫోకస్ పెట్టింది. బెంగళూర్ నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న నైజీరియన్లు గతంలో పట్టుబడ్డారు. వీరి మూలాలపై టీన్యాబ్ ఇన్స్పెక్టర్ రమేశ్ రెడ్డి నేతృత్వంలోని బృందాలు ఆరా తీశాయి. బెంగళూర్ నుంచే ఈ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ నెట్‌వర్క్‌లో కీలకంగా ఉన్నవారెవరు.. అనే విషయాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సూత్రదారిని గుర్తించి, అతడి గూర్చి ఆరా తీశారు. డ్రగ్ సరఫరా కోసం హైదరాబాద్‌కు ఎప్పుడూ వస్తున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ.. నిందితుడిని నీడలా వెంబడిస్తూ సుమారు 45 రోజులకు పైగా ఆపరేషన్ ‘పాస్టర్ ఉకా’ను నిర్వహించారు.
నైజీరియాకు చెందిన డేవిడ్ ఉకా 2013లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చాడు. గడువు ముగిన తర్వాత నకిలీ వీసాలు తయారు చేసి, వాటితోనే చలామణి అవుతున్నాడు. డేవిడ్ ఉకా నైజీరియన్ల కోసం ‘ఆలిండియా నైజీరియన్ స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ అసోసియేషన్’ను నిర్వహిస్తూ బెంగళూర్‌లో నైజీరియన్లకు సంబంధించిన కేసులు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి.. తనకు తానుగా పాస్టర్నంటూ ప్రచారం చేసుకున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని డ్రగ్స్ దందాలోకి దింపుతూ.. తన నెట్‌వర్క్‌ను దేశ వ్యాప్తంగా విస్తరించుకున్నాడు.
టీ న్యాబ్‌కు లభించిన ఆధారాలతో బెంగళూర్‌లో ఒక ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. అతడి గూర్చి అక్కడ ఎవరికీ తెలియదు. యజమానికి కూడా తెలియకుండా ఆ ఇంట్లో కొన్నాళ్లుగా ఉంటున్నాడు. అనుకోకుండా ఓ రోజు ఆ ఇంటికి బైక్ దొంగతనం కేసులో మరో నిందితుడి వేటలో బెంగళూరు పోలీసులు వెళ్లారు. తన కోసమే పోలీసులు వచ్చారనుకున్న డేవిడ్ ఉకా, తన మకాం(డెన్)ను మరో ప్రాంతానికి మార్చాడు. టీ న్యాబ్ పోలీసులు కొత్త చిరునామా తెలుసుకోవడం, అతడిని గుర్తించి పట్టుకోవడం కోసం అక్కడే ఉంటూ రోజుల తరబడి నిఘా పెట్టారు. అతడి బైక్ నంబర్ ‘3’తో మొదలవుతుందనే క్లూ మాత్రం టీ న్యాబ్‌కు వచ్చింది. దీంతో అనుమానం ఉన్న ప్రాంతాల్లోని బైకులు, మూడు నంబర్‌తో మొదలయ్యే వాహనాలను పరిశీలించారు. నాలుగు వాహనాలపై అనుమానం రావడంతో.. ఆ వాహనాల రాకపోకలపై నిఘా పెట్టారు. నిందితుడు బయటకు వెళ్లాడంటే.. శరీరం కనబడకుండా బట్టలు వేస్తాడు. ముఖానికి మాస్క్, కండ్లకు నల్ల అద్దాలు, హెల్మెట్, చేతులకు గ్లౌస్లు పెట్టి బయటకు వస్తాడు. అతడి చిరునామాను గుర్తించి, అతడి కదలికలపై నిఘా పెడుతూ టీ న్యాబ్ వెంబడిస్తూ వచ్చింది. ఇటీవలే డ్రగ్స్ విక్రయించేందుకు అతడు హైదరాబాద్‌కు రావడంతో పక్కా ప్లాన్‌తో టీన్యాబ్ అరెస్ట్ చేసింది.