మేడ్చల్ జోన్ బృందం,జనవరి 1: నూతన సంవత్సరం వేడుకలను నియోజకవర్గ ప్రజలకు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా వాకిళ్లలను రంగు రంగుల రంగవళ్లులతో అలంకరించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ముగ్గులను వేశారు. ఉదయాన్నే కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకున్నారు. కీసర మండల కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి, చీర్యాల్ లక్ష్మినర్సింహాస్వామి, శామీర్పేట మండలం ఆలియాబాద్లోని రత్నాలయం, మేడ్చల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం, రావల్కోల్ పరిధిలోని జయదర్శిని వేంకటేశ్వ స్వామి ఆలయం, ఘనపూర్లో క్షేత్రగిరి వేంకటేశ్వ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
నియోజకవర్గంలోని నేతలు మంత్రి మల్లారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంత్రి చామకూర మల్లారెడ్డిని జవహర్నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, కార్పొరేటర్లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఘట్కేసర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంత్రి మల్లారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొర్రెముల పంచాయతీ సభ్యులు దుర్గరాజు గౌడ్, ఆంజనేయులు, భాస్కర్, పర్నాటి బాబు,నాయకులు యాదగిరి, సత్యనారాయణ, రవి, సురేందర్, మన్యం పాల్గొన్నారు. మండల పరిధి ఏదులాబాద్ లోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ఘట్కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కుమార్తె సరయు రెడ్డి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనాథ విద్యార్థులకు స్నాక్స్, స్కిన్ కేర్ సబ్బులు అందజేశారు. దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్లు చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, ప్రజాప్రతినిధులు మంత్రి మల్లారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.