సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణలో పలు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నారాయణగూడ, మారేడ్‌పల్లి, బోయిన్పల్లి ట్రాఫిక్ పీఎస్‌లను తొలగించడంతోపాటు పాత వాటి పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకోవడం, స్థానిక ప్రజలు తొందరగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక డివిజన్ పేరును, మూడు పీఎస్‌ల పేర్లను మార్పు చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రత్యేక యూనిట్ల ఏర్పాటుతో మహిళా భద్రతా వింగ్‌లో ప్రత్యేక విభాగాలు, ప్రతీజోన్కు ఒక సైబర్ క్రైమ్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లుగా సీపీ పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా, మొత్తం హైదరాబాద్ సిటీ పోలీసుకు మంజూరైన 17.020 మంది సిబ్బందిని అంతర్గత సర్దుబాటు, కేటాయింపులు, మార్పులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ప్రభుత్వం జీవో నెం.57(హోం లీగల్ డిపార్ట్మెంట్) 2024 ఏప్రిల్ 24 తేదీ ద్వారా ఆమోదించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ నగర పోలీస్ పరిధిలో 72వ లా అండ్ ఆర్డర్ పోలీస్‌స్టేషన్‌గా టోలిచౌకి పీఎస్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇంతకు ముందు ఉన్న ఫిల్మ్‌నగర్ పీఎస్, హుమాయున్‌నగర్ పీఎస్(కొత్తగా మెహదీపట్నం పీఎస్), గోల్కొండ పీఎస్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్తగా ఏర్పాటు చేసిన టోలిచౌకి పీఎస్ లోకి తీసుకువచ్చారు.
గోల్కొండ డివిజన్‌ను టోలిచౌకి డివిజన్‌గా, సెక్రటరియేట్ పీఎస్‌ను లేక్ పీఎస్‌గా, హుమాయున్‌నగర్ పీఎస్‌ను మెహదీపట్నం పీఎస్‌గా, షాహినాయత్‌గంజ్ పీఎస్‌ను గోషామహల్ పీఎస్‌గా పేర్లు మార్చారు.
28 లా అండ్ ఆర్డర్ డివిజన్ల ప్రకారం ట్రాఫిక్ పీఎస్‌ల హద్దులు ఉండాలని ప్రస్తుతం ఉన్న మారేడుపల్లి, బోయిన్పల్లి, నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను తీసేశారు. ప్రస్తుతం ఉన్న లా అండ్ ఆర్డర్ పీఎస్ ల పరిధి ప్రకారం వాటికి సంబంధించిన ఏరియాల్లో పనిచేయడానికి ట్రాఫిక్ నాంపల్లి పీఎస్, ట్రాఫిక్ అంబర్‌పేట పీఎస్, ట్రాఫిక్ లంగర్‌హౌస్ పీఎస్, ట్రాఫిక్ బహదూర్‌పుర పీఎస్, ట్రాఫిక్ నల్లకుంట పీఎస్‌ల పేర్లను ట్రాఫిక్ గాంధీనగర్ పీఎస్, ట్రాఫిక్ ఉస్మానియాయూనివర్సిటీ పీఎస్, ట్రాఫిక్ కుల్సుంపుర పీఎస్, ట్రాఫిక్ ఛత్రినాకా పీఎస్, ట్రాఫిక్ సైదాబాద్ పీఎస్లుగా మార్చారు.
మహిళా భద్రతా వింగ్‌ను బలోపేతం చేయడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏర్పాటు చేసి దానికి 1 ఇన్స్పెక్టర్, 8 మంది సిబ్బంది, జువైనల్ బ్యూరో యూనిట్ ఏర్పాటు చేసి ఒక ఇన్స్పెక్టర్, ఏడుగురు సిబ్బంది ఉంటారు. ప్రతీ లా అండ్ ఆర్డర్ జోన్లో ఒక సైబర్ క్రైమ్ సెల్‌లను ఏర్పాటు చేసి ప్రతీ సైబర్ క్రైమ్ సెల్‌కు ఒక సబ్ఇన్స్పెక్టర్, ఐదుగురు పోలీస్స్టేబుళ్లతో సిబ్బంది ఉంటారు.
నగర పోలీసు కమిషనరేట్‌ను 35 ఏండ్ల తర్వాత జీవో ఎంఎస్ నం.32, తేదీ.30.04.2023(హోం లీగల్ డిపార్ట్మెంట్) ద్వారా పోలీసు పునర్ వ్యవస్థీకరించడానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ జోన్లుగా రెండు అదనపు జోన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు, 11 అదనపు ట్రాఫిక్ జోన్, మరో11 లా అండ్ ఆర్డర్ పీఎస్‌లు , మరో 13 ట్రాఫిక్ పీఎస్‌లు ఏర్పాటు చేశారన్నారు. నగరంలో ఉన్న 7 జోన్లకు 7 మహిళా పీఎస్‌లతో మహిళా భద్రతావిభాగం, ప్రత్యేక సైబర్‌క్రైమ్ యూనిట్, ఐటీవింగ్, నార్కోటిక్స్ వింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు.
ఈ మార్పుల కోసం అదనంగా 1200 మంది సిబ్బందిని మంజూరు చేశారని, గత రెండేండ్లుగా పీఎస్ హద్దులపై, కొత్త పీఎస్‌లకు వెళ్లడంలో ఎదురవుతున్న సమస్యలపై ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, ట్రాఫిక్ పోలీసులకు, లా అండ్ ఆర్డర్ పోలీసులకు కొన్ని ప్రాంతాల్లో అధికార పరిధిపై గందరగోళం ఉండటం, సైబర్‌క్రైమ్ వింగ్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సిటీ అధికారులతో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి తెలిపినట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.