GHMC | సిటీబ్యూరో, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఇంజినీర్లకు కొత్త కొలువు కష్టాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వ కొలువు.. అందులో హైదరాబాద్ పౌరులకు సేవలందించే కీలకమైన బల్దియా లో పోస్టింగ్ వచ్చిందంటూ సంబురపడిన ఏఈఈలకు నిరాశే ఎదురవుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు 146 మంది ఏఈఈలు కొత్త గా నియమాకం కాగా, ఇందులో జీహెచ్ఎంసీకి 112 మంది ఏఈఈలు ఈ నెల మొదటి వారంలో రిపోర్టు చేశారు.
ఐతే, రెండు వారాలు గడిచినప్పటికీ వీరికి ఇప్పటి వరకు బాధ్యతలు అప్పగించలేదు. ప్రాజెక్టు, నిర్వహణలో కొరత ఉందని చెప్పిన యం త్రాంగం, ఖాళీలను వీరితో భర్తీ చేయడంలో తాత్సా రం చేస్తున్నది. దీంతో ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగా రో జూ బాధ్యతల అప్పగింతపై ఏఈఈలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులను అడిగితే.. ‘అదిగో ఇస్తా.. ఇదిగో ఇస్తున్నాం’ అంటూ చెబుతున్నారని ఏఈఈలు వాపోతున్నారు. మొత్తంగా కొత్తగా కొలువులోకి వచ్చిన ఇంజినీర్లకు బాధ్యతలు అప్పగించకపోవడం చర్చనీయాంశంగా మారింది.