సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఒక సాప్ట్వేర్ ఉద్యోగిని ఇంటర్ చదవుతున్న తన ఇద్దరు పిల్లలతో కలిసి ఘట్కేసర్లోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతుచిక్కని ఆత్మహత్యల వెనుక అదృశ్య హంతకులున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆత్మహత్యల సమాచారం బయటకు రాకుండా ఇంటి దొంగలే సాక్ష్యాలను కాల్చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఆస్తి కోసం ఒక పథకం ప్రకారం జరిగిన మానసిక హత్య? అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. కేసు దర్యాప్తులో లోపాలున్నాయని, రైల్వే పోలీసులను సైతం ప్రలోభాలకు గురిచేసి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మృతురాలి భర్త ఈ అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. చెంగిచర్ల హరితవనం కాలనీలో నివాసముండే విజయారెడ్డి, భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుండగా, ఆమె కొడుకు విశాల్‌రెడ్డి, కూతురు చేతనలు ఇంటర్ చదవుతున్నారు.
జనవరి 30వ తేదీ రాత్రి విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో ఘట్కేసర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌పై బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న విజయారెడ్డి, ఇంటర్ చదువుతున్న తన పిల్లలను ఆత్మహత్యకు ఎలా ఒప్పించింది… తల్లి ఆత్మహత్య చేసుకుంటుండగా ఆపాల్సిన పిల్లలు… ఆమెతో కలిసి ఆత్మహత్యకు ఎలా ఒప్పుకున్నారు… అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమోచ్చింది… ఆత్మహత్యలకు గల కారణాలపై సమాజంలో ప్రతి ఒక్కరికీ అనుమానాలు కలిగాయి. ఆ ఆత్మహత్యలకు స్పష్టమైన కారణాలు పోలీసులు వెలికి తీస్తారా? అంతుచిక్కని ఆత్మహత్య ఘటనగానే మిగిలిపోతాయా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
కారణం కోసం వెతికిన భర్త
దుబాయ్‌లో ఉన్న సురేందర్‌రెడ్డి భార్య, పిల్లలు మృ తి చెందడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ విషయం నుం చి నెమ్మదిగా కోలుకుంటూ అసలు ఎందుకు తన భా ర్య, పిల్లలు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై మ దనపడ్డాడు.. ఘటన జరిగినప్పటి నుంచి ఏమి జరిగిందనే విషయాలు ఒక్కొక్కటి ఆరా తీస్తూ వచ్చాడు.. తన భార్య, పిల్లల ఆత్మహత్యల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానించాడు. అందుకు కొన్ని ఆధారాలు సేకరించాడు, ఆస్తులన్ని కొట్టేసేందుకు భారీ కుట్ర జరిగిందని, తనకు కూడా ప్రాణ హాని ఉందని గుర్తించాడు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించి, తనకు ప్రాణ హాని ఉందని, తన భార్య, పిల్లల మృతి వెనుక కుట్ర కో ణంతోపాటు తాను, తన భార్య సంపాదించిన రూ.కోట్ల ఆస్తులను దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఆ ఫిర్యాదులో పలు అనుమానాలు వ్యక్తం చేశా డు, అందులోని ప్రధాన విషయాలు ఇలా ఉన్నాయి.
విజయారెడ్డి డైరీ మాయం
తన కుటుంబం ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే షాక్‌కు గురైన సురెందర్‌రెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. చెంగిచర్లలోని తన ఇంటి వద్దనే భార్య, పిల్లల అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నాడు, అయితే దుబాయ్ నుంచి వచ్చే వరకు మృతదేహాలను విజయారెడ్డి పుట్టింటి వారు అక్కడి నుంచి సురెందర్‌రెడ్డి సొంత గ్రామానికి పంపించేశారు. మృతదేహాలు అక్కడి నుంచి తీసికెళ్లిన తరువాత ఇంట్లో ఉన్న కోటినర్న విలువైన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మాయం చేశారు.
విజయారెడ్డికి డైరీ రాసే అలవాటు ఉందని, ఆ డైరీ కన్పించడంలేదని, ఆమె ఐఫోన్ కూడా మాయమైందని, కిటికీ వద్ద కాగితాలు కాల్చేసిన అనవాళ్లు ఉన్నాయని, ఆత్మహత్యకు గల కారణాలపై సూసైడ్ లేఖ అయి ఉండే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు. అలాగే చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్న కారును కూడా రైల్వే పోలీసుల సహకారంతో తీసేసుకున్నారని, అందులో కూడా ఏదైనా అనవాళ్లు ఉండే అవకాశాలున్నాయని ఆరోపించాడు.
కూతురు, మనమడు, మనమరాలు చనిపోయిన బాధ కంటే ఆస్తిని ఎలా దక్కించుకోవాలనే విషయంపైనే విజయారెడ్డి తల్లి దృష్టి పెట్టిందని ఇది అత్యంత విషాదకరమైన కోణమంటూ సురేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. జనవరి 28న తన కూతురును తల్లి హాస్టల్లో దింపి వచ్చిందని, 30వ తేదీన కొడుకు, కూతురిని హాస్టల్ నుంచి తీసుకొచ్చిందని సురేందర్‌రెడ్డి తెలిపాడు. అయితే 29వ తేదీన ఇంట్లో ఏం జరిగిందనేదానిపై అనుమానాలున్నాయని, ఆస్తి విషయంలో విజయారెడ్డిని బెదిరించి, ఇబ్బంది పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశాడు.
సెటిల్ చేసుకోమని బెదిరింపులు
నీవు చనిపోతే ఆస్తి అంతా ఎవరికి వెళ్తుంది, వెంటనే సెటిల్ చేసుకోమని తనకు బెదిరింపులు వస్తున్నాయని సురేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కూడా అవసరమైతే బందోబస్తు ఏర్పాటు చేస్తామని హామీమి ఇచ్చారు. అయితే ఈ కేసు దర్యాప్తు రైల్వే పోలీసులు చేస్తున్నారని, ఆత్మహత్యలపై కాకుండా ఇతర అంశాలు ఏమైనా ఉంటే తాము పరిగణలోకి తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మేడిపల్లి ఇన్స్పెక్టర్ శంకరయ్య ’నమస్తే తెలంగాణ’కు వివరించారు.
దర్యాప్తుపై అనుమానాలు?
ఆత్మహత్యల ఘటన జరుగగానే సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కొద్ది హడావిడి చేశారు. సాంకేతికి ఆధారాలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఈ విషయంపై లోతైన దర్యాప్తు జరపకుండా ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని కాలయాపన చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యల వెనుక కుట్ర కోణాలున్నాయా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీశారా? ఏదైనా అజ్ఞాత శక్తి పోలీసులను ఆపేసిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయకముందు సురేందర్‌రెడ్డి రైల్వే పోలీసులను కలిసి తన గోడు వెల్లబోసుకున్నట్లు సమాచారం.
అయితే రైల్వే పోలీసులు సైతం ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోమని ఉచిత సహాలు ఇచ్చారని తెలిసింది. సెటిల్మెంట్ అనే పదం దర్యాప్తు అధికారుల నుంచి రావడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోతైనా దర్యాప్తు జరపకపోవడం వెనుక అదృశ్య శక్తులు పనిచేశాయని, పోలీసులను ప్రలోభాలకు గురిచేయడంతోనే దర్యాప్తులో వేగం మందగించిందని, పూర్తిగా ఈ కేసును ఛేదించకుండా, ఒంటరితనం, మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు చేసుకున్నారని రైల్వే పోలీసులు వెల్లడిస్తూ వచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రైల్వే డీఎస్పీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన అందుబాటులోకి రాలేదు, అయితే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్‌తో మాట్లాడగా దర్యాప్తు దాదాపు పూర్తయ్యిందని, కొత్త విషయాలు ఏమీ లేవని, ఆ ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.