మెహిదీపట్నం, డిసెంబర్ 11 : ప్రజలకు రవాణా సౌకర్యాలలో ఇబ్బందులు లేకుండా చేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నూతనంగా బీటీ రోడ్లు నిర్మిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూ గుంతలు లేకుండా రోడ్లను అందిస్తున్నారు. కార్వాన్ నియోజకవర్గం టోలిచౌకి, గోల్కొండ డివిజన్ల ప్రధాన రోడ్లకు జీహెచ్ఎంసీ సర్కిల్ -13 ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఆధునీకరించే పనులు చేపట్టారు. టోలిచౌకి ప్రధాన రోడ్డు నుంచి అక్బర్‌పురా మీదుగా ఎండీ లైన్స్ వరకు ఉన్న రోడ్డును బీటీ రోడ్డుగా మార్చారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నూతనంగా రోడ్డును వేశారు.
సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు ..
టోలిచౌకి నుంచి లంగర్‌హౌస్, గోల్కొండ ప్రాంతాలకు అక్బర్‌పురా, ఎండీలైన్స్ మీదుగా వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తారు. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ జాంలు ఏర్పడితే ఎండీ లైన్స్ నుంచి టోలిచౌకి వెళ్లడానికి ఉన్న రోడ్డు సౌకర్యంగా ఉంటుంది. ఈ రోడ్డులో కొన్ని నెలలుగా గుంతలు ఉండటంతో స్థానికులు, ఈ రోడ్డులో వచ్చే పోయే వారు ఇబ్బందులకు గురయ్యేవారు. దీనిని గుర్తించి జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులు నూతనంగా రోడ్డు వేశారు. ఈ రోడ్డు వేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యాత్మక ప్రదేశాలు గుర్తిం చి రోడ్లు నిర్మిస్తున్నాం
ప్రజలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సవ్యంగా జరిగేలా కార్వాన్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్లను నిర్మిస్తున్నాం.అంతర్గత రోడ్లను వీడీసీసీ రోడ్లుగా మార్చుతున్నాం. గుంతలు ఉన్న రోడ్లను గుర్తించి వాటిని మరమ్మతులు చేస్తున్నాం. ప్రధాన రోడ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తూ ప్రయాణికులు, వాహనదారులకు ప్రయాణాలు సాఫీగా సాగేలా కృషి చేస్తున్నాం.
– వి.నర్సింహ, డిప్యూటీ కమిషనర్