TGSRTC | సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఏదైన పండుగ వచ్చుడే పాపం అన్నట్టు.. ఆర్టీసీ ప్రయాణికులను దోచుకుంటోంది. స్పెషల్ బస్సుల పేరుతో రెట్టింపు ధరలు వసూలు చేస్తూ సామాన్యుడిపై తీవ్ర భారం మోపుతోంది. శనివారం రాఖీ పండుగ రోజున అటు టీజీ ఆర్టీసీ.. ఇటు ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి రెట్టింపు ధరలు వసూలు చేశాయి. సిటీలోని ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రత్యేక బస్సుల పేరుతో వివిధ మార్గాల్లో రాకపోకలకు వినియోగించారు.
ఈ బస్సుల్లో టికెట్ ధరలు రెట్టింపు వసూలు చేశారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అందుబాటులో ఉన్నప్పటికీ ఆ బస్సులను పరిమిత సంఖ్యలో నడిపి ప్రత్యేక బస్సుల పేరుతో అధిక బస్సులు అందుబాటులో ఉంచి డబ్బులు దండుకున్నారు. ఎంజీబీఎస్ నుంచి కరీంనగర్‌కు వెళ్లడానికి రూ.360, ఉప్పల్ నుంచి హనుమకొండకి రూ.310, ఎల్బీనగర్ నుంచి సూర్యపేటకి రూ.310 టికెట్ ధర వసూలు చేశారు. రాఖీ పండుగ దృష్ట్యా ఉదయం నుంచే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.
దీంతో శివారు మార్గాలన్నీ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఉప్పల్-హనుమకొండ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు హయత్‌నగర్ ప్రధాన మార్గంలోనూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనికి తోడు చాలామంది సొంత వాహనాల్లో ఊళ్లకు ప్రయాణం చేశారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రైవేట్‌లో మూడు రెట్లు చార్జీ..!
పండుగకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన బస్సులు అన్నీ ఫుల్ అయిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా ఇష్టారీతిన చార్జీలు వసూలు చేశారు. ఉప్పల్ నుంచి హనుమకొండ, నల్లగొండ మార్గాల్లో ప్రైవేట్ క్యాలు, వాహనాల డ్రైవర్లు.. టికెట్‌పై మూడు రెట్లు అధికంగా డబ్బులు వసూలు చేశారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో డ్రైవర్ అడిగినంత ధర ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
మరోవైపు ఆన్లైన్లో ఆర్టీసీ టికెట్లు బుకింగ్ చేసుకున్న వారి నుంచి సైతం భారీగా వసూలు చేశారు. 150 కిలోమీటర్ల దూర ప్రయాణానికి సైతం రూ.600పైగా వసూలు చేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ‘పండుగ రావడమే పాపం.. ప్రయాణికుల రక్తం తాగుతున్నారు’ అని ఆర్టీసీ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓవైపు ఉచిత బస్సు అటూ గొప్పలు చెప్పుకుంటూ.. మరోవైపు భారీగా డబ్బులు వసూలు చేయడం’ ఏంటని ప్రయాణికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.