సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రముఖ అమ్మవారి దేవాలయమది. ప్రతీ నెల ప్రత్యేకించి ఆషాఢ,శ్రావణమాసాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఈ దేవాలయం అసిస్టెంట్ కమిషనర్ కేడర్ ఆలయం కాగా బోనాల పండుగ కోసం ఇన్చార్జీ గ్రేడ్ వన్ ఈవోను ఇన్‌చార్జీగా వేశారు. అంతకుముందు రెగ్యులర్ ఈవోను మానసికంగా ఒత్తిడికి గురిచేసి ఆయనను సెలవుపై వెళ్లేలా వ్యవహరించారు. తర్వాత రాత్రికి రాత్రే అర్హతలు లేని ఈవోకు ఇన్చార్జి బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అందులో పేర్కొన్న బాధ్యతల కాలపరిమితి ముగిసినా ఇంకా అదే సీటుపై అనధికారికంగా కొనసాగేందుకు సహకరిస్తున్నారు. ఇంత చేస్తున్నా..ఆ ఇన్చార్జి ఈవోకు ఇన్చార్జి మంత్రిగారి అండదండలు మెండుగా ఉన్నాయని..అందుకే నిబంధనలు నీళ్లకు వదిలేసి అర్హతలే లేని ఈవోకు అడ్డంగా అధికారం కట్టబెట్టి తన ఆధిపత్యం ప్రకటించుకున్నారని దేవాదాయశాఖలో చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకూ ఈ ఇన్చార్జి ఈవో సదరు మంత్రిగారి దగ్గరి బంధువంటూ ఆ శాఖలో పెద్ద ఎత్తున ప్రచారమవుతోంది. ఈ ప్రధాన ఆలయానికి రాకముందు ఆయన చేసిన గుళ్లన్నీ సాధారణమైనవేనని , ఆ ఈవోకు సదరు దేవాలయ నిర్వహణ, పెద్ద జాతర నిర్వహించిన అనుభవం లేకపోయినప్పటికీ నగరంలోని అతి పెద్ద బోనాల ఉత్సవాల్లో ఒకటైన ఈ అమ్మవారి ఆలయంపై పెత్తనం చెలాయిస్తూ వ్యవస్థనంతా తన గుప్పెట్లో ఉంచుకోవడానికి నిబంధనలు వర్తించకపోయినా ఉత్సవాలకు ఎవరో ఒకరు కావాలంటూ ఆ మంత్రి తన సామాజికవర్గానికే చెందిన గ్రేడ్ వన్ ఈవోను తెచ్చుకున్నారని ఉద్యోగులు అనుకుంటున్నారు.
కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఈ ఆలయ నిర్వహణలో తన మనిషి ఉంటే అంతా అనుకూలంగా ఉంటుందని ఉత్సవాల నిర్వహణ కీలకదశకు చేరుకున్న సమయంలో అప్పటికే బాధ్యతల్లో ఉన్న రెగ్యులర్ ఈవోను మంత్రి తన పరుషమైన మాటలతో మానసికంగా వేధించి అతను లీవ్‌లో వెళ్లిపోయేలా చేశారని దేవాదాయశాఖలో చర్చించుకుంటున్నారు. గత నెలలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆ దేవాలయానికి రెగ్యులర్ ఈవోగా ఉన్న అధికారి బోనాలకు అమ్మవారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడడానికి మంత్రి పిలిస్తే అతని దగ్గరకు వెళ్లారని, అక్కడ అవమానకర రీతిలో మాట్లాడి బయటకు పంపడంతో ఏం చేయాలో తోచక మనస్తాపానికి గురైన ఈవో అక్కడి నుంచి నేరుగా హెడ్ ఆఫీసుకు వచ్చి తాను 25 రోజులు లీవ్పెడుతున్నానని చెప్పి జూన్ 13 నుంచి జూలై 7 వరకు సెలవు పెట్టి వెళ్లిపోయారని, ఇందుకు కారణం మంత్రి తన సొంత వ్యక్తి కోసం ఆ అధికారి పట్ల వ్యవహరించిన తీరేనని ఎండోమెంట్ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
ఈనెల 7తో ఆ ఇన్చార్జి ఈవోకు ఆర్డర్లో పేర్కొన్న అదనపు బాధ్యతల సమయం కూడా ముగిసింది. కానీ ఇప్పటికీ ఆ ఆలయ ఇన్‌చార్జీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆలయంలో ఆదాయవ్యయాలపై సదరు మంత్రిగారికి ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తూ తన పబ్బం గడుపుకొంటున్నట్ల్లు దేవాదాయశాఖలో చర్చిస్తున్నారు. తన బంధువైన అధికారికి అర్హతలు లేకున్నా..ఫుల్ అడిషనల్ చార్జ్ ఇప్పించిన ఆ అమాత్యుడు ప్రస్తుతం ఉత్సవాలు ముగిసి అందుకు ఇన్‌చార్జీగా ఈవో కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా అదే పోస్టులో కొనసాగేలా సహకరించడంపై ఉన్నతాధికారులు పెదవి విరుస్తున్నారు.
మరోవైపు రెగ్యులర్ ఈవో తన లీవ్ పూర్తయి విధుల్లోకి వచ్చినా అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా కమిషనర్ ఆఫీసులో రిపోర్ట్ చేయమంటూ చెప్పి ఖాళీగా తిప్పుతున్నారు. ఇంతకుముందు రెగ్యులర్ ఈవోగా పనిచేసిన అధికారి ఉన్న సమయంలో దేవాలయానికి ఒక సంవత్సరంలో 3 కోట్ల అదనపు ఆదాయాన్ని తెచ్చేలా కృషి చేశారని..కానీ మంత్రిని కాదంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.