పని మనుషులుగా చేరి.. వృద్ధ దంపతులను కట్టేసి మత్తు మందు ఇచ్చి.. దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠా సభ్యులందరినీ ఎట్టకేలకు జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతనెల మే 11న దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠా సభ్యుల్లోని కొందరిని ఐదు రోజుల వ్యవధిలోనే అరెస్టు చేయగా, ఇన్నాళ్లు పరారీలో ఉన్న మిగతా వారిని కూడా సాంకేతిక సమాచారంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో గాలించి.. శనివారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
-మారేడ్‌పల్లి, జూన్ 6
వివరాలు వెల్లడించిన సీపీ సుమతి
మారేడ్‌పల్లి, జూన్ 6:పని పనుషులుగా చేరి.. వృద్ధ దంపతులతో నమ్మకంగా ఉంటూ అదును చూసి దోపిడికి పాల్పడిన నేపాలీ ముఠా సభ్యులను జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, విదేశీ కరెన్సీతోపాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయంలో పోలీసు కమిషనర్ బి.సుమతి, డీసీపీ శ్రీధర్‌తో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. కౌకూర్‌లోని మోహన్స్ గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో మురళీమోహన్, విజయలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు.
భర్త రిటైర్డు ప్రొఫెసర్ కాగా, భార్య డాక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతుల ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన నేపాల్‌కు చెందిన మీనా అలియాస్ మమత, భర్త రాజేష్‌లు ఇంట్లో పని చేయడానికి ఇద్దరు పని మనుషులు ఉన్నారని, అన్ని పనులు చేసి పెడుతారని వారిని నమ్మించారు. ఏప్రిల్ 25వ తేదీన సబీనా అలియాస్ సునీతతో పాటు భర్తగా రాజేష్‌ను పరిచయం చేస్తూ ఆ ఇంట్లోకి పని మనుషులుగా చేరారు. ఈ క్రమంలో సబీనాకు వంట పని, ఇంటి పని సక్రమంగా నేర్పించడానికి మీనా కూడా వృద్ధ దంపతుల ఇంట్లోకి చేరింది. మే 11వ తేదీన మీనా అలియాస్ మమత పుట్టిన రోజు ఉందని క్వాటర్స్‌లో వేడుకలను ఏర్పాటు చేసింది.
ముఠా సభ్యులైన సామ్రాట్, డేనియల్ చారో చాంగ్, కిరణ్, బిస్వాల్, జంకర్ శంకర్, కమల్‌లతో ముఠాను ఏర్పాటు చేసిన మీనా పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఒకొక్కకరిని ఇంట్లోకి వచ్చేలా చేసింది. ఈ క్రమంలో నేపాలీ ముఠా సభ్యులు మురళీ మోహన్‌కు మత్తు మందు ఇచ్చి నిద్రలోకి జారుకునేలా చేశారు. అనంతరం అతని భార్య విజయలక్ష్మికి కూడా మత్తు మందు ఎక్కించే ప్రయత్నం చేయగా, ఆమె వారిని బతిమిలాడడంతో… ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి సృహ కోల్పోయేలా చేశారు. అల్మారాలను పగలగొట్టి సుమారు 60 తులాల బంగార, 15 కిలోల వెండి, రెండు సెల్ ఫోన్లు, 3వేల డాలర్ల నగదు, ఇతర విలువైన వస్తులను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు.
నిద్రలోంచి తెరుకున్న తరువాత మురళీమోహన్ వెంటనే జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఓటీ, సీసీఎస్ విభాగాలతో 6 బృందాలను ఏర్పాటు చేసి 5 రోజుల వ్యవధిలోనే నిందితులను సునీత అలియాస్ సబీనా, బిస్వాల్ విశ్వల్, కమల్ బహదూర్, జంకర్ బహదూర్, శంకర్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలింనట్లు తెలిపారు . పరారీలో ఉన్న మీనా, రాజేష్, డేనియల్ చారో అలియాస్ చాంగ్, కిరణ్‌ను శనివారం అరెస్టు చేసి రిమాండ్ కుతరలించారు.
పోలీస్ కస్టడీకి గ్యాంగ్ సభ్యులు
బంజారాహిల్స్, జూన్ 6: జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజా రంజన్ హత్యకేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులను పోలీసులు 10రోజుల కస్టడీకి తీసుకున్నారు. గత నెల 8న విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ ఇంట్లో పనిచేస్తున్న కల్పన అలియాస్ ధర్మతో పాటు సహా ఏడుగురు నేపాలీగ్యాంగ్ సభ్యులు అతడి భార్య తనూజారంజన్ను హత్య చేసి భారీగా నగదు, బంగారం చోరీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో పాలుపంచుకున్న కల్పనతో సహా ఆరుగురు నిందితులు పోలీసుల కళ్లుగప్పి నేపాల్‌కు పారిపోగా గ్యాంగ్ సభ్యుడు సునీల్ పర్యార్‌ను, ముంబయికి చెందిన బంగారం రిసీవర్ దిలీప్ బహదూర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా చంచల్‌గూడ జైల్లో ఉన్న సునీల్ పర్యార్, దిలీప్ బహదూర్‌ను 10రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో శనివారం వారిద్దరినీ జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నేపాలీ గ్యాంగ్‌లో ఎవరెవరున్నారు.. చోరీ తర్వాత ఎక్కడికి వెళ్లారు.. వాటాల పంపకం తదితర అంశాలతో పాటు ఇతర నిందితుల ఆచూకీ గురించి ప్రశ్నించనున్నారు.