Nehru Zoo Park | చాంద్రాయణగుట్ట, ఫిబ్రవరి 26 : వేసవి వచ్చిందంటే చాలు.. బహదూర్‌పురాలో ఉన్న జూ పార్కుకు సందర్శకులు, పర్యాటకుల సందడి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూ పార్క్ ఎంట్రీ ఫీజును భారీగా పెంచారు. చివరిసారిగా 2023 వేసవి కాలంలో టికెట్ల ధరలను అధికారులు పెంచారు. ఇప్పుడు మరోసారి రేట్లను పెంచాలని గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.
జూ పార్కులో ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ. 70, వారాంతంలో రూ. 80గా ఉంది. మార్చి 1వ తేదీ నుంచి పెద్దలకు రూ. 100, పిల్లలకు రూ. 50 వసూలు చేయనున్నారు. పిల్లలకు గతంలో రూ. 45 ఉండేది. ఇక టాయ్ ట్రైన్, బిఓవి, 11 సీటర్ బిఓవి ఎక్స్ క్లూజివ్, ఫిష్ ఆక్వేరియం తదితరాల ధరలను పెంచలేదు.
జూ పార్కులో సినిమా షూటింగు తీయడానికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ వారి నుంచి ఎమ్మార్వో షూటింగ్ కెమెరాలకు రూ. 600లు తీసుకునేవారు. మార్చి 1 నుంచి సినిమా షూటింగ్‌లకు సంబంధించిన కెమెరాలకు రూ. 10 వేలు ఫీజుగా తీసుకోనున్నారు. ప్రొఫెషనల్ వీడియో కెమెరాకు రూ. 2500 ఫీజుగా తీసుకుంటారు.