సిటీబ్యూరో/ మల్కాజిగిరి, జూన్ 25 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి పనుల విషయంలో ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ జాప్యం వెరసి మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని రాజానగర్, వెంకట్రాదినగర్ కాలనీవాసులకు నరకప్రాయంగా మారింది. వర్షాకాలం ముంగిట్లోకి వచ్చినా పనులు పూర్తికాకపోవడంతో ఈసారి వరదముంపు ఒకవైపు, అసంపూర్తిగా వదిలేసిన పనులతో అవస్థలు మరోవైపు … గత 3 నెలలుగా నత్తనడకన సాగుతున్న స్ట్రామ్ వాటర్ బాక్స్ డ్రైన్ పనులు కాలనీవాసుల పాలిట శాపంగా మారాయి.
ముఖ్యంగా బాక్స్డ్రైన్ల నిర్మాణంలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లముందు పెద్దపెద్ద గోతులు తీసి వదిలేయడంతో వరద కాలువ దాటాలన్నా, ఇంట్లోకి వెళ్లాలన్నా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని సర్కస్ ఫీట్లతో సాహసం చేయాల్సిన దుస్థితి నెలకొంది. రాత్రి వేళ్లల్లో బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. అత్యవసర సమయాల్లో కాలనీల్లోకి అంబులెన్సులు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
బాక్స్ డ్రైన్ పనుల పుణ్యమా అని రాజానగర్‌లో ఇళ్లకు వచ్చే తాగునీటి, డ్రైనేజీ పైపులైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే వీటిని పునరుద్దరించాల్సిన కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేయడంతో కొత్త దందాకు తెరలేచింది. పైపులైన్ల రిపేర్లు, కొత్త కనెక్షన్ల పేరుతో కొంతమంది వ్యక్తులు ఒక్కో ఇంటికి రూ.1,000 నుంచి రూ.5వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇక బాక్స్డ్రైన్ పనుల సందర్భంగా మురుగునీటిని తరలించేందుకు సరైన ప్రత్యామ్నాయ ( డ్రైవర్షన్) ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగా మురుగునీరంతా ఇళ్ల ముందే నిలి చి దుర్వాసన వస్తోంది. దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారు.
పైపులైన్ల నిర్మాణం పనులు జరుగుతున్న వాటిపై పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవంగా ఈ డ్రైన్ పనులు గత అక్టోబర్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇటీవల మార్చిలో ప్రారంభం కావడం.. కాంట్రాక్టర్, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నది అక్షరసత్యం.. వరదనీటి లైన్లలో డ్రైనేజీ పైపులైన్లను కలుపుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీనికి తోడు డ్రైనేజీ పారుతున్న, నిర్మాణం పనులు అలాగే చేపడుతున్నారు.
నీటిని తొలగించి, పనులు చేయాల్సి ఉన్నా వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పనులు జరుగుతున్న చోట పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కనిపించడంలేదు. బాక్స్ డ్రైన్ పనులు సందర్భంగా నిర్మాణంలో వాటర్ పైపులు అడ్డుగా వెళ్లినా.. అలాగే నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో వరద సమయంలో చెత్త పైపులకు తట్టుకొని, వరదనీరు ఇండ్లలోకి చేరే ప్రమాదం ఉంది. మంచినీటి పైపులు లీకైతే మురుగు చేరి, నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్, వాటర్‌వర్క్స్ అధికారుల సమన్వయలోపంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
రాజానగర్, వెంకటాద్రినగర్‌లో బాక్స్డ్రైన్ పనుల జాప్యం, పైపులైన్ల ధ్వంసం, అదేవిధంగా తాగునీటి పైపులైన్ల తొలగింపు, తాగునీటి ట్యాంక్‌లోకి మురుగునీరు చేరిక తదితర అంశాలపై ప్రజావాణిలో కాలనీవాసులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయితే అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.