సిటీబ్యూరో, మే 11(నమస్తే తెలంగాణ): ప్రపంచానికి నూతన సాంకేతికతను అందించడంలో సీఎస్ఐఆర్ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఆదివారం నేషనల్ ఆకాడమీ ఆఫ్ సైన్స్, హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో.. ఐఐసీటీలో నిర్వహించిన నేషనల్ టెక్నాలజీ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలక పాత్రను పోషిస్తుందన్నారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సవాళ్లకు పరిశోధన, సాంకేతికత పరిష్కారం చూపుతుందన్నారు. అనంతరం ఏఐజీ హాస్పిటల్ చైర్మన్, పద్మ విభూషణ్ గ్రహీత డా.డీ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… అధునాతన వైద్య విధానంలో జీర్ణాశయంలోని సూక్ష్మజీవులు ఎంతో కీలకమని, వీటిపైనే మనిషి రోగ నిరోధకత, జీవక్రియలు, ఆయురారోగ్యాలు ఆధారపడి ఉన్నాయన్నారు.
మనిషి మనుగడను ప్రభావితం చేసే జీర్ణాశయ సూక్ష్మజీవుల నిర్వహణ లోపంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. వీటిని అధ్యయనం చేసినైట్లెతే నిత్యం ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఐఐసీటీ డైరెక్టర్ డా.శ్రీనివాస్ రెడ్డి, సీసీఎంబీ డైరెక్టర్ డా.వినయ్ కుమార్, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డా.ప్రకాష్ కుమార్, సైంటిఫిక్ అడ్వైజరీ కౌన్సిల్-నేషనల్ అకాడమీ సైటింఫిక్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డా.సీహెచ్ మోహన్రావు, సీఎల్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.