సోషల్ మీడియా మోజులో యువత వింతపోకడ అమాయకుల ప్రాణాలమీదుకు తీసుకొస్తుంది. రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారులను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.. తాజాగా ఔటర్ రింగ్ రోడ్‌పై ఓ యువకుడు రీల్స్, వీడియోలు చేస్తూ 200 కిలోమీటర్లకు పైగా స్పీడ్‌తో కారు నడిపి ప్రాణాంతక విన్యాసాలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నార్సింగి పోలీసులు అప్రమత్తమై యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ నగరానికి అభివృద్ధి ప్రతీకగా నిలిచిన ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు కొందరి నిర్లక్ష్యపు యువకుల చేతుల్లో ప్రాణాంతక ప్రయోగాల వేదికగా మారుతుంది. కొందరు యువకులు సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. తాజాగా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై చోటు చేసుకున్న ఘటన మరోసారి సమాజాన్ని ఆలోచనలో పడేసింది. కొత్తపల్లి యశ్వంత్‌రెడ్డి అనే యువకుడు తన వోక్స్వ్యాగన్ కారుతో నార్సింగి టోల్ ప్లాజా నుంచి పోలీస్ అకాడమీ టోల్ ప్లాజా వరకు గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడిపి ప్రాణాంతక విన్యాసాలకు పాల్పడ్డాడు. సాధారణంగా విమాన టేకాఫ్ వేగాన్ని తప్పించేలా దూసుకెళ్లిన ఈ కారు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
సోషల్ మీడియాలో వైరల్ కోసం..
సోషల్ మీడియా రీల్స్, వైరల్ వీడియోల మోజు యువతను ప్రమాదకర దారుల్లోకి నెడుతోంది. ఎవరు ఎక్కువ స్పీడ్‌తో వెళ్లారు..? ఎవరు ప్రమాదకర స్టంట్ చేశారు..? ఎవరి వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి..? అనే పోటీ యువతలో పెరుగుతుంది. కొందరు యువకులు తాము చేసే నిర్లక్ష్యాన్ని ైస్టెల్‌గా భావిస్తున్నా అదే సమయంలో వారి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఎదురు చూస్తుంటారు. ఒక యువకుడి తప్పిదం వలన అమాయక కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు రాష్ట్రంలో ఇప్పటికే అనేకం ఉన్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు..
యశ్వంత్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో నార్సింగి పోలీసులు అప్రమత్తమయ్యారు. వీడియో ఆధారంగా వాహనం వివరాలు సేకరించి యశ్వంత్‌రెడ్డిని గుర్తించారు.
అనంతరం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తప్పవని, సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే ప్రమాదకర విన్యాసాలను సహించబోమని హెచ్చరిస్తున్నారు.
ఔటర్‌పై బైక్ రైడర్ల స్టంట్స్..
ఔటర్ రింగ్ రోడ్‌ను కొందరు యువకులు రేసింగ్ ట్రాక్‌గా మార్చేస్తున్నారు. ఇటీవల ద్విచక్ర వాహనాలు నిషేధం ఉన్నప్పటికీ కొందరు బైక్ రైడర్లు ఔటర్ పైకి ఎక్కి స్టంట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కారుతో 200 కిలోమీటర్లు వేగాన్ని దాటడం మరింత ప్రమాదక సంకేతంగా మారింది. ఇది కేవలం ఒక వ్యక్తి నిర్లక్ష్యం కాదు… సమాజ భద్రతను సవాల్ చేసే చర్యగా పోలీసులు భావిస్తున్నారు.