సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) :‘మత్తు’కు మూకుతాడు వేసుందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్‌న్యూ) అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్ నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు హైదరాబాద్‌లో విక్రయిస్తున్న 15మందిని అరెస్టు చేశారు. ఇప్పటికే 100 మందుల దుకాణాలను సీజ్ చేసిన అధికారులు ఇకపై డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి మెడికల్ దుకాణాల్లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు అతిక్రమించే షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
15 మంది డ్రగ్ డీలర్లు అరెస్టు
మత్తు కోసం యువతలో కొందరు కొత్తదారులు వెతుకుతున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారు కొందరు దగ్గు మందు సిరఫ్, అల్ఫ్రజోలం ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. వీరిని ఆసరాగా చేసుకుంటున్న మెడికల్ ఎజెన్సీలు, మందుల షాపుల నిర్వాహకులు వైద్యుల సిఫార్సు లేకుండానే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడైంది. తాజాగా ఈ విషయాన్ని హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్‌న్యూ) ఢిల్లీ, రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నట్లు వెలుగులోకి తెచ్చింది. మత్తెక్కించే మందులను విక్రయించే వారిపై దృష్టిపెట్టిన హెచ్‌న్యూ 15 మంది డ్రగ్ డీలర్లు, సరఫరాదారులు, విక్రయదారులను అరెస్ట్ చేసింది. ఈ వివరాలను గురువారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్‌న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరించారు.
1160 బాటిళ్లు స్వాధీనం
దగ్గు కోసం వాడే ఈ ముందు ఒక మోతాదులో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలి. కాని ఇక్కడ ప్రధాన సరఫరా దారుడి నుంచి వినియోగదారుడి వరకు ఎక్కడ కూడా బిల్లులు ఉండవు, ప్రిస్కిప్సన్స్ ఉండవు. ఈ మందు తయారీలో ఓపియమ్కు సంబంధించిన డ్రగ్‌ను వాడుతారు. మత్తెక్కించే మందు కావడంతో ఎలాంటి బిల్లులు లేకుండా, అక్రమ పద్ధతిలో వీటిని వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పవన్ అగర్వాన్, మహ్మద్ బషీర్ అహ్మద్, సత్యనారాయణ, పోచం వేణులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2.32 లక్షల విలువైన 1160 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
20 పైసల అల్ఫ్రజోలం ట్యాబ్లెట్స్ రూ.12కు విక్రయం
అల్ఫ్రజోలం మాత్రలను డిఫ్రెషన్, ఆందోళనలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. దీనిని కూడా వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలి. కాచిగూడకు చెందిన గణేశ్ ఫార్మష్యూటికల్స్ సంస్థ యజమాని అద్దంకి వెంకట సురేశ్ రాజస్థాన్‌కు చెందిన బయో-ల్యాబ్ రెమెడిస్, హైదరాబాద్‌లోని కవాడిగూడకు చెందిన అంజత మెడికల్ ఏజెన్సీ నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున ఈ అల్ఫ్రజోలం ట్యాబ్లెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తాడు. వాటిని న్యూ గడ్డిఅన్నారంకు చెందిన జి.పూర్ణచందర్, మీర్‌పేట్‌కు చెందిన మల్లేశ్, లంగర్‌హౌస్‌కు చెందిన ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, రామంతాపూర్‌కు చెందిన కొండ వేణుగోపాల్ (జోహోన్లీ ఫార్మ, జోనల్ మేనేజర్)లు మెడికల్ దుకాణాలలో పనిచేసేవారు. మెడికల్ దుకాణ దారులైన శ్రీధర్, పవన్‌కుమార్, మహ్మద్ అబ్దుల్ హఫీజ్, మహ్మద్ అబ్దుల్ సమీ, జహీరుద్దీన్, నీరజ్ సింగ్ తదితరుల ద్వారా అవసరమైన వారికి 20 నుంచి 30 పైసలు ధర ఉండే వీటిని రూ.12 వరకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్ రమేశ్ రెడ్డి, ఎస్సై వెంకటరాములు బృందంతో పాటు మలక్‌పేట్, కుల్సుంపురా ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, టి.అశోక్‌కుమార్ బృందాలు రెండు కేసులలో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 1,52,400 అల్ఫ్రజోలం ట్యాబ్లెట్లు(15.2 కిలోలు), 14 సెల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు. ఈ రెండు ఘటనలలో సీజ్ చేసిన సామాగ్రి విలువ రూ.40 లక్షలు ఉంటుందన్నారు.
రూ.40లకు కొని.. రూ.200లకు విక్రయం
దక్షిణ ఢిల్లీకి చెందిన పవన్ అగర్వాల్ అక్రమంగా కొడైన్ పాస్ఫేట్ సిరప్ (దగ్గు మందు)ను ఎలాంటి బిల్లుల లేకుండా హైదరాబాద్, అంబర్‌పేట్‌లోని మహ్మద్ బషీర్ అహ్మద్‌కు చెందిన బయో స్పేర్ మెడికల్ ఏజెన్సీకి రూ.40లకు ఒక బాటిల్‌ను సరఫరా చేస్తున్నాడు. వాటిని సైదాబాద్‌కు చెందిన సత్యనారాయణ, ఉప్పల్‌లోని అక్షయ మెడికల్‌కు చెందిన పోచం వేణుకు సరఫరా చేసేవాడు. వారు ఓల్డ్‌సిటీ, నాంపల్లి, మెహిదీపట్నం, మలక్‌పేట్, అంబర్పేట్ ప్రాంతాలలో రూ.200లకు ఒక బాటిల్ చొప్పున నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తారు.
మెడికల్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు
మెడికల్ దుకాణదారులు కొనుగోలు, విక్రయాలు చేసే వారి వద్ద ప్రతి ట్యాబ్లెట్ వివరాలు ఉండాలి. అలా లేని మెడికల్ దుకాణాలు, డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమించే వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. మెడికల్ దుకాణాలలో ప్రిస్క్రిప్షన్ చూసిన తరువాత మందులు ఇవ్వాలి. ఈ మందులు షెడ్యూల్డ్ హెచ్1 డ్రగ్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రిస్కిప్షన్ కూడా ఒక నెలరోజులలోపు అయి ఉండాలి. డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి మెడికల్ దుకాణాలలో సంయుక్తంగా తనిఖీలు, ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం.
– చక్రవర్తి గుమ్మి, హెచ్‌న్యూ డీసీపీ
లైసెన్స్‌లు రద్దు చేస్తాం
అమ్మకాలు, కొనుగోళ్లలో తేడాలుంటే లైసెన్స్‌లు రద్దు చేస్తాం. మెడికల్ దుకాణాలలో నిబంధనలు పాటించకపోవడంతో గత ఏడాది 100 దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేశాం. హైదరాబాద్‌లో 25 వేల మెడికల్ దుకాణాలున్నాయి. అన్నింట్లో తనిఖీలు చేపడుతాం. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీనారాయణ, డ్రగ్ ఇన్స్పెక్టర్