ముషీరాబాద్, ఏప్రిల్ 21: షెడ్యూల్ ఏరియాలోని ఇసుక క్వారీలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స్ నర్సింహ ఆరోపించారు. సోమవారం ఆదివాసి నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ ఇసుక పరస్పర సహకార సంఘాలు ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు రాష్ట్ర అధ్యక్షులు కోర్స్ నర్సింహ, ఓయూ జేఏసీ చైర్మన్ గద్దె వెంకట్, ఎమ్మార్పీఎస్ జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ. . తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గోదావరి నదిలోని ఇసుకను కారు చౌకగా ప్రభుత్వం కాజేస్తుందన్నారు. ప్రభుత్వం తేనున్న నూతన ఇసుక పాలసీ షెడ్యూల్ చట్టాలు.. ఎల్ టి ఆర్పే, సా చట్టాలను కాలరాసి ఆదివాసులకు అన్యాయం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మైండ్స్ అండ్ మినరల్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టంలోని సెక్షన్ 11 (5) ప్రకారం ఐదో షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వం లేదా ఇతర వ్యక్తులు మైనింగ్ చేసే అధికారం లేదని చెబుతుందన్నారు.
షెడ్యూల్ ఏరియాలో గిరిజన సహకార సంఘాలకు మాత్రమే మైనింగ్ చేసే అధికారం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ నండూరి నర్సింహ, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నాయకులు డప్పు రమేష్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ఆదివాసి అడ్వకేట్ రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన పాపారావు, మహిళా సంఘం రాష్ట్ర నాయకులు వాట్టం సుభద్ర, ఇసుక సొసైటీ ములుగు జిల్లా అధ్యక్షులు రామలక్ష్మి, రజిని కుమారి పద్మ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.