Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులకు సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబాల మధ్య రచ్చ కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళ్తే.. కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కుమార్తెకు, నందీశ్వర్‌గౌడ్ పెద్ద కుమారుడు అభిషేక్ గౌడ్‌కు చాలాకాలం కిందట పెళ్లి జరిగింది. ఆ దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఈ గొడవల కారణంగా వారు విడాకులు తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో తన కుమార్తెకు కట్నంగా ఇచ్చిన ప్లాట్ ఖాళీ చేయాలని అల్లుడు నందీశ్వర్ గౌడ్‌పై కేఈ ప్రభాకర్ ఒత్తిడికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కేఈ ప్రభాకర్‌ను అభిషేక్ గౌడ్ గన్‌తో బెదిరించారు. తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ బెదిరింపులపై అక్టోబర్ 25వ తేదీన రాయదుర్గం పోలీసులకు కేఈ ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి అభిషేక్ గౌడ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో మణికొండలోని పంచవటి కాలనీలో అభిషేక్ గౌడ్ నివాసానికి వెళ్లిన పోలీసులు వెపన్ కోసం సెర్చ్ చేస్తున్నారు.