Nampally Court | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : తప్పుల తడకగా రివిజన్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసు అధికారులపై గురువారం జిల్లా కోర్టు జడ్జి సీరియస్ అయ్యారు. కిందిస్థాయి కోర్టులో జారీ చేసిన నెం.885కు బదులు నెం.918గా రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారని న్యాయవాది లలితారెడ్డి కోర్టుకు తెలపడంతో జడ్జి సురేష్ అధికారులపై మండిపడ్డారు. ఉత్తర్వు ప్రతిలో ఉన్న నెంబర్‌ను రివిజన్ పిటీషన్లో సరిచూసుకోవాలని అధికారులకు సూచించారు. 5 రోజుల కస్టడీ కోరుతూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేయడంతో ఉత్తర్వును సవాలు చేస్తూ పోలీసు అధికారులు జిల్లా కోర్టును ఆశ్రయించారు.
మహిళా జర్నలిస్టులు పి.రేవతి, బండి సంధ్యా అలియాస్ తన్వీయాదవ్లను పోలీసుల కస్టడీకి అప్పగించాలని జిల్లా కోర్టులో రివిజన్ పిటీషన్ దాఖలు చేశారు. రివిజన్ పిటీషన్‌లోని తప్పును సవరించి కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశిస్తూ విచారణను 17కు వాయిదా వేశారు. కింది కోర్టులో సెక్షన్ 111 బీఎన్ఎస్ తొలగించినప్పటికీ రివిజన్ పిటీషన్లో జోడించడం చట్ట విరుద్దమని న్యాయవాది లలితారెడ్డి కోర్టుకు తెలిపారు. వెంకటయ్య అనే రైతు కడుపు మండి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమంలో ప్రసారం చేసినందుకు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేసిన పోలీసులు రైతుకు మాత్రం 35(2) నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ కేసులో ఉన్న ఫోటో గ్రాఫర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఇటీవల సైబర్ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. జర్నలిస్టులిద్దరూ షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. రివిజన్ పిటీషన్‌పై నిందితుల తరఫున కౌంటర్ దాఖలు చేయనున్నట్టు న్యాయవాది తెలిపారు.
మహిళా జర్నలిస్టులు పి.రేవతి, బండి సంధ్యా అలియాస్ తన్వీయాదవ్లను మానసికంగా, శారీరంగా హింసించాలనే ఉద్దేశ్యంలోనే పోలీసు అధికారులు రివిజన్ పిటీషన్ వేశారని, సీఎం ఆదేశాలకనుగుణంగానే పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారని న్యాయవాది లలితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని అధికారులు గమనించాలన్నారు. రైతుకో చట్టం మహిళా జర్నలిస్టులకో చట్టం అమలు చేయరాదన్నారు. కేసులో ఉన్న వారందరికీ ఒకే చట్టం అమలు చేయాలని అధికారులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కైలాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రభుత్వం కనుసన్నలో పోలీసు అధికారులు పనిచేస్తున్నారని మండిపడ్డారు. మహిళా జర్నలిస్టులకు జిల్లా కోర్టులో సైతం న్యాయం లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కింది స్థాయి కోర్టు పోలీసు కస్టడీ పిటీషన్‌ను కొట్టివేయడం హర్షనీయమన్నారు. జర్నలిస్టుల గొంతునొక్కడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.