Nalsar University | శామీర్‌పేట, సెప్టెంబర్ 12: న్యాయ విద్యాలయంలోనే సరైన న్యాయం జరగడం లేదని విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించాలంటూ గురువారం నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ ఎదుట ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసి, ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. నల్సార్‌లో చదువుతున్న విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించకుండా.. మేనేజ్మెంట్ విద్యార్థులను రెండో పౌరులుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. లక్షల రూపాయలు ఫీజులు కట్టి మేనేజ్మెంట్ కోర్సులో చదివే విద్యార్థులను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ విద్యార్థి సంఘంలో సభ్యులుగా కూడా లేకుండా చేస్తున్నారన్నారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని తెలిపారు. ఎల్ఎల్బీ చదివే విద్యార్థులకు ఉన్న ప్రాధాన్యత వేరే ఇతర కోర్సులు చేసే వారికి లేదన్నారు. యూనివర్సిటీలో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉంటే ఎల్ఎల్బీ కాకుండా ఇతర కోర్సుల్లో చదివే విద్యార్థులు 500 మంది ఉన్నారని వివరించారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.