సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ ) : నాలా అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్తో కలిసి సర్కిల్లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. నదీమ్ కాలనీ, షా హతీం కాలనీలలో ఎస్ఎన్డీపీ పనులను పరిశీలించారు. సాలార్ బ్రిడ్జి జంక్షన్ అభివృద్ధి, మిలిటరీ బౌండరీ సీవరేజ్ పైపులైన్ పనులను పూర్తి చేయాలన్నారు.
సాలార్ జంగ్ కాలనీలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. జియాగూడ స్లాటర్ హౌజ్‌తో పాటు కార్వాన్ సర్కిల్లోని ఆదిత్యనగర్ పార్కు, హకీంపేట్, సాలార్ బ్రిడ్జి, టౌలిచౌకి, సాలార్ జంగ్ కాలనీ, బంజరు దర్వాజ, నానల్ నగర్, జియాగూడ కాలనీలలో పర్యటించి శానిటేషన్, స్మార్ట్ వాటర్ డ్రైనేజీ, నాలా పనులు పరిశీలించారు. కమిషనర్ వెంట ఈఎన్సీ జియావుద్దీన్, జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రె, ఎస్ఎన్డీపీ ఎస్ఈ కిషన్ తదితరులు పాల్గొన్నారు.