Music Director Chakravarthy | బంజారాహిల్స్, నవంబర్ 7: షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్‌లో సంగీత దర్శకుడు చక్రవర్తికి కేటాయించిన ఖరీదైన ప్రభుత్వ స్థలంలో వెలసిన ఆక్రమణలను తొలగించిన మండల రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే.., షేక్‌పేట మండలం సర్వే నం.403లోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం.14లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 1984లో అప్పటి ప్రభుత్వం 20 గుంటల స్థలాన్ని సినీ సంగీత దర్శకుడు చక్రవర్తికి కేటాయించారు. ఈ స్థలంలో రికార్డింగ్ థియేటర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే, ఏండ్లు గడిచినా రికార్డింగ్ థియేటర్ నిర్మించకపోవడంతో ఏడాది తర్వాత స్థలం కేటాయింపు రద్దయింది
. కాగా, 2006లో ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, సంగీత దర్శకుడు చక్రవర్తి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉండటంతో స్థలాన్ని ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచింది. ఇదిలా ఉండగా, ఇటీవల స్థలంలో కొంత మంది వ్యక్తులు నిర్మాణాలు చేపట్టడంతో పాటు వాటిని అద్దెలకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది రెండు రోజులుగా ఇటీవల కూల్చివేతలు చేపట్టారు. గురువారం స్థలంలోని ఆక్రమణలను తొలగించడంతో పాటు ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థలంలో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి హెచ్చరించారు.