సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో మూసీ వైపు చూస్తే చాలు.. నలుపు రంగులో ప్రవహించే మురుగునీరు, పిచ్చి మొక్క లు, గడ్డి దుబ్బలు, దోమల స్వైర విహారం, ఆక్రమణలు.. ఇవన్నీ ఒకప్పటి ముచ్చట. కాని, ప్రస్తుతం క్రమక్రమంగా మూసీ స్వరూపమే మారుతోంది. నది పొడవునా ఎటూ చూసినా పచ్చదనం, ఇరువైపులా సైకిల్ ట్రాక్‌లు, విశాలమైన రహదారులు, బ్రిడ్జిలు, ఫౌంటెయిన్లు, అధునిక పార్కులు, వాక్ వేలతో సర్వాంగ సుందరంగా మూసీ ముస్తాబు అవుతున్నది. సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ పేరిట ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పా టు చేసి జీవనదికి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ప్రభు త్వం ముమ్మరంగా సుందరీకరణ పనులు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మూసీ నదిని వైవిధ్యంగా, విభిన్నంగా, కొత్త సొబగులతో అలరించేలా తీర్చిదిద్దుతున్నా రు. అటు ట్రాఫిక్ చిక్కులు తీర్చడంతో పాటు ఇటు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తగిన వాస్తు శిల్పాలతో ఉండాలని ప్రభుత్వం భావించింది.
ఇప్పటికే దుర్గం చెరువు, ట్యాంక్బండ్లు పర్యాటక ప్రాంతాలుగా కొత్త సొగసులతో ఆకట్టుకుంటుండటంతో మూసీనదిని అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మలిచేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు మూసీ వెంబడి నూతనంగా 12 వంతెనల నిర్మాణాలపై దృష్టి సారించింది. ఈ వంతెనలతో ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండాలని యోచిస్తోంది. ఇందుకు గానూ ఈ వంతెనలన్నింటి అంచనా వ్యయం దాదాపు రూ.390 కోట్లు అంచనా వేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హెచ్ఆర్డీసీఎల్ (హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్)ల ఆధ్వర్యం లో వీటిని నిర్మించనున్నారు. ఐతే ఇప్పటికే మూసీని 100 శాతం స్వచ్ఛ మూసీగా మార్చేందుకు గానూ నూతనంగా జలమండలి ఆధ్వర్యంలో 31 ఎస్టీపీల పనులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
అఫ్జల్‌గంజ్ ఐకానిక్ వంతెన, ముసారం బాగ్, ఇబ్ర హీం బాగ్ కాజ్ వే, చాదర్‌ఘాట్, సన్‌సిటీ-చింతల్మెట్, కిస్మత్పూర్ (ఇన్నర్ రింగు రోడ్డును కలుపుతూ), బుద్వేల్ (ఐటీ పార్కులు, కనెక్టింగ్ రోడ్లను కలుపుతూ), హైదర్షా కోట్-రామ్‌దేవ్‌గూడ, అత్తాపూర్ (పాత బ్రిడ్జీకి సమాంతరంగా), ఉప్పల్ లే అవుట్ (మూసీ దక్షిణ ఒడ్డును కలుపుతూ), ప్రతాప్ సింగారం -గౌరెల్లి మార్గంలో నిర్మించే వంతెనలను మన వారసత్వ, చారిత్రక ప్రతీకలుగా నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కొత్త బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే లంగర్‌హౌజ్, పురానాపూల్, అఫ్జల్‌గంజ్, చాదర్‌ఘాట్, ముసారం బాగ్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో రాకపోకలు సాగించేవారికి ఎంతో సదుపాయం ఉంటుంది. మూసీలోకి మురుగునీరు చేరకుండా చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి.
దాదాపు 54 కిలోమీటర్ల మేర ఉన్న మూసీపై కొత్తగా వచ్చే ఈ వంతెనలతో పాటు, పాత వంతెనలకు కూడా కొత్త సొగసులద్దనున్నారు. కొత్త వంతెనలు అందంగా కనిపించేందుకు తగిన వాస్తు శిల్ప డిజైన్లకు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ (రెక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) ఆహ్వానించారు. ఆర్కిటెక్చర్లో అనుభవజ్ఞులు, నిపుణులతో పాటు అర్కిటెక్చర్ విద్యార్థులు కూడా అవకాశం కల్పించారు. ఉత్తమ డిజైన్లతో ఎంపికైన వారికి మొదటి బహుమతికి రూ.2లక్షలు, ద్వితీయ బహుమతికి లక్ష రూ పాయలు, మూడో బహుమతికి రూ.50 వేలతో పాటు ముగ్గురికి కన్సోలేషన్గా రూ.20 వేల వంతున నగదు బహుమతులను అందించనున్నారు. ఆసక్తి ఉన్న వాస్తు శిల్ప డిజైనర్లు ఈ నెల 25వ తేదీలోగా www.temder. telangana.gov.in, www.ghmc.gov.inm www. nium.org.in ను సంప్రదించాలని సూచించారు.
జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నది. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేసి దిగువ మూసీలోకి అధికారులు నీటిని వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌లోకి 1,600 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, నాలుగు గేట్లను రెండు అడుగలు మేర ఎత్తి దిగువ మూసీలోకి 960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్‌లోకి 3,500 క్యూసెక్కుల నీరు రాగా, ఐదు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 3,500 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. రెండు రిజర్వాయర్ల నుంచి 4,460 క్యూసెక్కుల జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. ఈ మేరకు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు.