సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని నగర పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు. 2023 జనవరి నుంచి జూన్ 30 వరకు, ఈ ఏడాది ఆరు నెలలతో పోలిస్తే హత్యలు, హత్యాయత్నాలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. అయితే, దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన అంశాలను ఈ ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని, గతేడాది తొలి ఆరు నెలల్లో 103 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 151 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.