వెంగళరావునగర్, డిసెంబర్ 22: బల్కంపేట శ్మశానవాటికలో జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. రూ.300 కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్మశానవాటిక సమీపంలో ఉన్న సీసీ కెమెరాల సాయంతో ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం ప్రకారం.. బాపూనగర్ సమీపంలో ఫుట్‌పాత్‌పై ఉంటూ చిత్తుకాగితాలను ఏరుకుని జీవించే రాజు(35) ఈ నెల 18వ తేదీ రాత్రి బల్కంపేట నేచర్‌క్యూర్ దవాఖాన సమీపంలోని శ్మశానవాటికలో హత్యకు గురైన విషయం తెలిసిందే. చిత్తు కాగితాలు ఏరుకునే రాజు సహచరులైన నేపాల్‌కు చెందిన విశాల్ బహదూర్(24), దాసారాం బస్తీకు చెందిన నాగనోళ్ల నాగరాజు(32) ఎస్ఆర్నగర్లోని ఉమేశ్‌చంద్ర విగ్రహం సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉంటున్నారు. వీరంతా కలిసి చిత్తు కాగితాలు ఏరుకుని, వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తూ ఫట్పాత్పైనే ఉంటున్నారు. వీరికి మద్యం, గంజాయి, స్పిరిట్ తీసుకునే అలవాటు కూడా ఉంది.
రాజు ఈ నెల 18న విశాల్ బహదూర్ వద్ద నుంచి రూ.300లు బలవంతంగా లాక్కున్నాడు. తిరిగి ఇచ్చేందుకు నిరాకరించాడు. అదే రోజు సాయంత్రం ఈ ముగ్గురు.. మరో మిత్రుడు రమేశ్‌తో కలిసి బల్కంపేట శ్మశానవాటికలో కూర్చుని మద్యం తాగారు. తీసుకున్న రూ.300లు తిరిగి ఇవ్వాలని విశాల్ బహదూర్‌తో పాటు నాగోళ్ల నాగరాజ్ కలిసి రాజును అడిగాడు. రాజు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. దీంతో రాజును తీవ్రంగా కొట్టారు. వీరి ఘర్షణ చూసి రమేశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం విశాల్ బహదూర్, నాగోళ్ల నాగరాజ్ కలిసి బండరాయితో రాజు తలపై మోది హత్య చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.