శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 08:11:11

ఒత్తిడి తెచ్చినందుకే.. హత్య

ఒత్తిడి తెచ్చినందుకే.. హత్య

  • వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికే.. కూతురును ఇచ్చి వివాహం..
  • విషయం తెలిసి కూతురు ఆత్మహత్య
  • కేసు కాంప్రమైజ్‌ విషయంలో గొడవ..
  • పడుకున్న అల్లుడిపై కత్తితో దాడిచేయగా మృతి
  • పోలీసులకు లొంగిపోయిన నిందితురాలు

ఉప్పల్‌ : వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికే కూతురును ఇచ్చి వివాహం చేసింది.. ఇది తెలిసిన కూతురు ఆత్మహత్య చేసుకుంది.. ఈ కేసులో తల్లి, భర్తను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.. బెయిల్‌పై బయటకు వచ్చి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు.. కేసు కాంప్రమైజ్‌ విషయంలో గొడవ జరగగా.. పడుకున్న అల్లుడిపై కత్తితో పొడిచి హత్య చేసింది.. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ సంఘటన  ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుం ది. ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి కథనం ప్రకారం.. రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న అనిత(38) క్యాటరింగ్‌ పని చేస్తుంది. అనితకు 20 సంవత్సరాల క్రితం వివాహం కాగా.. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. అనితను 10 సంవత్సరాల క్రితం భర్త వదిలివేశాడు. దీంతో కుటుంబ జీవనం కోసం క్యాటరింగ్‌ పనులు చేస్తూ మీర్‌పేటలో నివాసం ఉండేది. ఈ సమయంలో నవీన్‌కుమార్‌(32) అనే వ్యకి పరిచయం కాగా.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే పెద్ద కూతురు వందన(19)ను 2019లో నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత  వివాహం చేసింది. విషయం తెలుసుకున్న వందన.. తన తల్లితో దూరంగా ఉండాలని భర్తకు సూచించగా..  అతడు భార్యను బెదిరించాడు. దీంతో వందన ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన మీర్‌పేట పోలీసులు నవీన్‌కుమార్‌, అనితలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అనిత పార్సిగుట్టలో నివాసం ఉండగా, నవీన్‌కుమార్‌ విజయవాడకు వెళ్లిపోయాడు. విజయవాడ నుంచి తిరిగి వచ్చిన నవీన్‌కుమార్‌ ప్రస్తుతం అనిత నివాసం ఉంటున్న ప్రాంతానికి అక్టోబర్‌ 11న వచ్చాడు. ఇద్దరు కలిసి  రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలోకి వచ్చి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా.. కేసు కాంప్రమైజ్‌ కావాలని, పిల్లలతో మాట్లాడాలని నవీన్‌.. అనితపై ఒత్తిడి తెచ్చాడు.  దీంతో విసిగిపోయిన అనిత నవీన్‌కుమార్‌ను హత్య చేయాలని భావించింది.  కేసు విషయంలో బుధవారం రాత్రి ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో అనితను కొట్టిన నవీన్‌కుమార్‌ పడుకున్నాడు. గురువారం ఉదయం 3 గంటల ప్రాంతంలో నిద్రపోతున్న నవీన్‌పై కత్తితో అనిత దాడిచేయగా.. అతడు అక్కడిక్కడే మృ తిచెందాడు. ఉదయం 7.30 గంటల సమయంలో అనిత ఉప్పల్‌ పోలీసులకు హత్య విషయం తెలియజేసి లొంగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.