వనస్థలిపురం, డిసెంబర్ 16 : వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని హత్యచేసి రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం విజయపురి కాలనీ ఫేజ్1 కమాన్ వద్ద దుప్పట్లో నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుప్పట్లో సుమారు 40ఏండ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. డాగ్ స్కాడ్, క్లూస్‌టీంతో అన్ని ఆనవాళ్లు, వస్తువులను సేకరించారు. మృతుడి కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలకు గురిచేసి చంపినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహం కాళ్లు తెల్లటి గుడ్డతో కట్టి ఉండంగా, చేతి మణికట్టుపై రక్తపు మరకలు కనిపించాయి. తలకు తీవ్రగాయాలు కావడంతో మృతి చెందినట్లు తెలుస్తున్నది. మృతదేహాన్ని చుట్టిన దుప్పట్లో ఓ చీర కూడా ఉండటం విశేషం. అయితే మూడు రోజుల కిందట హత్యచేసి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.