శేరిలింగంపల్లి, అక్టోబర్ 11: గోపన్‌పల్లి తండాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గచ్చిబౌలి సీఐ సురేశ్, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా దారారం గ్రామానికి చెందిన ముడావత్ శేఖర్ నాయక్ (30) బతుకుదెరువు కోసం పదేండ్ల కిందట నగరానికి వలస వచ్చాడు. భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి గోపన్‌పల్లి తండాలో ఉంటున్నాడు. శేఖర్, జ్యోతి దంపతులిద్దరూ మేస్త్రీ పనిచేసుకుంటూ.. జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సైతం గొడవపడ్డారు. రాత్రి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లిన శేఖర్ తిరిగిరాలేదు. అతడి ఆచూకీ కోసం భార్య జ్యోతి, కుటుంబసభ్యులు వెతికారు. సోమవారం ఉదయం రంగనాథనగర్ లేఅవుట్‌కు వెళ్లారు. సమీపంలోనే ఓ గెస్ట్‌హౌస్ వద్ద నిర్మానుష ప్రదేశంలో బండి కనిపించింది. కొద్దిదూరంలో శేఖర్‌నాయక్ మృతదేహాన్ని గుర్తించి..గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సురేశ్ పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు శేఖర్ నాయక్‌ను గొంతు కోసి హత్యచేసినట్లు గుర్తించారు. క్లూస్‌టీం, డాగ్ స్వాడ్‌ను పిలిపించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ చెప్పారు.