బొల్లారం,సెప్టెంబర్ 16: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను, అడ్డువచ్చిన అత్తను నరికి చంపేశాడు. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపిన కథనం ప్రకారం..తిరుమలగిరి మిలటరీ దవాఖాన సమీపంలోని క్వార్టర్స్‌లో చిన్నబాబు(38) పుష్పలత దంపతులు నివాసముంటున్నారు. వీరికి నాలుగేండ్ల బాబు, రెండేండ్ల కూతురు. చిన్నబాబు మిలటరీ దవాఖానలో ఎలక్ట్రిషన్‌గా విధులు నిర్వహిస్తుండగా, పుష్పలత నర్సుగా పనిచేస్తున్నది. పుష్పలత ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించి.. తరచూ గొడవపడేవాడు. గురువారం ఇదే విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన చిన్నబాబు కొబ్బరిబొండాలు నరికే కత్తితో కుమారి, ఆమె అత్త మెడపై నరికాడు. తీవ్ర గాయాలతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రావణ్ తెలిపారు.