శంషాబాద్, సెప్టెంబర్ 11 : రాజేంద్రనగర్‌లో వృద్ధురాలు మేరీ క్రిస్టియన్ హత్య కేసు మిస్టరీ వీడింది. దత్తత కూతురే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ముగ్గురు నిందితులను శనివారం అరెస్టు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్‌కు చెందిన మేరీ క్రిస్టియన్ (68) అనే మహిళ గండిపేట మండలం దర్గాఖాజీకాన్లో పాఠశాల నడుపుతున్నది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. ఒకరు నగరంలో నివాసముంటే.. మరో కూతురు పుదిచ్ఛేరిలో చదువుకుంటున్నది. ఈ క్రమంలో రోమ(24), ప్రియాంక అనే యువతులను మేరీ దత్తత తీసుకొని పెంచుకుంటున్నది.
రోమ విక్రమ్ అనే వ్యక్తితో వివాహ సంబంధం ఏర్పర్చుకోవడంతో మేరీ నిరాకరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రోమ.. తన ప్రియుడితో కలిసి కొండాపూర్‌కు వెళ్లిపోయింది. మరోవైపు ఆస్తులను తనకు దక్కకుండా మేరీ చేస్తున్నదని అక్కసు పెంచుకుంది. ఆమెను అడ్డు తొలగించుకోవాలని రోమ, ఆమె ప్రియుడు విక్రమ్ శ్రీరాముల(25), మరో వ్యక్తి జగద్గిరిగుట్టకు చెందిన రాహుల్ గౌతమ్ అలియాస్ సాయి(24) పథకం వేశారు. ఈ నెల 8న మేరీని ఆమె నివాసంలోనే గొంతు నులిమి చంపేశారు.
మృతదేహాన్ని కారులో తరలించి.. హిమాయత్‌సాగర్ చెరువులో పడవేశారు. తమకేం తెలియనట్లు తిరిగి వచ్చేశారు. మరుసటి రోజు మృతురాలి అల్లుడు ప్రశాంత్ రాజేంద్రనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వృద్ధురాలి మృతదేహం చెరువులో తేలింది. సాంకేతిక అంశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రోమనే హంతకురాలిగా తేల్చారు. ఆమెతో పాటు విక్రమ్, రాహుల్గౌతమ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.