కొండాపూర్, సెప్టెంబర్ 11 : చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ మహిళ.. తన తల్లితో కలిసి కన్నకూతురినే కడతేర్చింది. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం…. శివాజీనగర్‌లో నివాసముండే వడ్డె యాదమ్మ (30)కు రాముతో 2011లో వివాహం జరిగింది. కూలీ పనులు చేసి జీవనం సాగిస్తున్న వీరికి నలుగురు సంతానం కాగా అనారోగ్యంతో ఇద్దరు పిల్లలు మరణించారు. మూడేండ్లుగా యాదమ్మ మద్యానికి బానిస కావడంతో దంపతుల మధ్య గొడవలు జరిగి… రాము ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు అలవాటుపడిన యాదమ్మ… తన పనులకు అడ్డుగా ఉన్నదని కూతురు కృష్ణవేణి(5)ని ఈనెల 9న గురువారం పొగపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి యజమానే తన కూతురిని చంపాడంటూ.. తల్లి వడ్డె తిమ్మవ్వతో కలిసి నాటకం ఆడింది. రాము ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానంతో యాదమ్మ, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు యాదమ్మను, ఆమెకు సహకరించిన తల్లిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.