వినాయక్‌నగర్, జూన్ 26: ఆర్థిక ఇబ్బందులతో వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో ఓ వ్యక్తిని అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.. మెదక్ జిల్లా చేగుంట మండలం, అనంతసాగర్‌కు చెందిన నదీమ్ రాజేశ్‌గౌడ్ (34) మనోవికాస్‌నగర్, శ్రీసత్యసాయి ఎన్‌క్లేవ్‌లోని డొక్కు మంగతయారు(75) ఇంట్లో అద్దెకు భార్యతో కలిసి ఉంటున్నాడు. రాజేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ప్రస్తుతం ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటున్నాడు. మంగతయారు.. భర్త చనిపోవడం, ముగ్గురు పిల్లలు బయట ఉంటుండటంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. కాగా.. రాజేశ్ ఉద్యోగం పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగగా.. భార్య పుట్టింటికి వెళ్లింది.
స్నేహితుడు ఉమేశ్ వద్ద రూ.లక్ష తీసుకోగా.. ఇప్పుడు ఇవ్వాలని రాజేశ్‌ను హెచ్చరించాడు.. దీంతో రాజేశ్.. ఇంటి యజమానురాలిని హత్యచేసి.. ఆమె చేతులకు ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకుని కొంపల్లిలోని ఓ ఫైనాన్స్‌లో కుదువపెట్టి రూ. రూ.1.9లక్షలు తీసుకున్నాడు. అందులో నుంచి రూ.లక్షను ఉమేశ్‌కు ఇచ్చాడు.. మిగిలిన రూ.7వేలను మంగతయారు కోడలుకు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. గతంలో మంగతయారు కూతురు నుంచి తీసుకున్న అప్పును రూ.15వేలను చెల్లించాడు. మిగిలిన డబ్బును కొంపల్లిలోని ఐడీబీఐ బ్యాంక్‌లో జమచేశాడు.. కాగా.. మంగతయారు కూతురు ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు రాజేశ్గౌడ్ను అరెస్ట్ చేశారు.. ఫైనాన్స్‌లో కుదువ పెట్టిన బంగారు గాజులతో పాటు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.