మేడ్చల్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తుండటంతో ప్రగతిపథంలో దూసుకుపోతున్నాయి. మూడేండ్ల కిందట మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.536.72 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.260.74 కోట్ల మేర అభివృద్ధి పనులు పూర్తికాగా 275.597 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 3021 పనులు పూర్తిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
చేపడుతున్న పనులు..!
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కమ్యూనిటీ భవనాలు, వైకుంఠాధామాలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, హరితహారం, డంపింగ్ యార్డులు, ఓపెన్ జీమ్లు తదితర వాటిని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో ఇప్పటికే పనులు పూర్తికాగా.. మరికొన్ని మున్సిపాలిటీల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, సెప్టెంబర్ 14, (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెల రూ.18 కోట్లు ఖర్చుచేస్తుండగా, 12 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లకుగాను రూ.4.50 కోట్లు ఖర్చుచేస్తున్నది. ఈ నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు దేశంలోనే టాప్ 20లో నిలిచాయి.