బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : జీహెచ్ఎంసీకి చెందిన క్రీడా మైదానాల్లో కొంతమంది ప్రైవేటు కోచ్‌లు పాగావేసి లక్షలాది రూపాయలు అడ్డదారిలో సంపాదిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉండాల్సిన గ్రౌండ్స్‌ను అనధికారికంగా ప్రైవేటు కోచింగ్ కేంద్రాలుగా మార్చుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేరుకు జీహెచ్ఎంసీ ఆన్లైన్లో బుకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా దీని వెనుక జరుగుతున్న తతంగం విస్మయానికి గురిచేస్తున్నది. ముఖ్యంగా సంపన్నులు నివాసముంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నం. 18లోని జీహెచ్ఎంసీ టెన్నిస్ గ్రౌండ్లో ఏడాదిన్నర కాలంగా ప్రైవేటు వ్యక్తులు తిష్టవేసి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్లైన్లో స్లాట్స్ మొత్తం తమ వారితోనే బుక్ చేయించి సరికొత్త దందాకు తెరతీశారు.
జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేహెచ్‌ఐసీ) ఎదురుగా ఉన్న సుమారు ఎకరం విస్తీర్ణం స్థలంలో జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు టెన్నిస్ కోర్టులు ఉన్నాయి. వీటిలో ఆడుకోవాలంటే జీహెచ్ఎంసీకి చెందిన అధికారిక వెబ్సైట్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4నుంచి 8 గంటల వరకు స్లాట్స్‌ను వ్యక్తిగతంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెలవారీ బుకింగ్ కోసం ఒక్కో వ్యక్తికి రూ. 450 చెల్లించాల్సి ఉంటుంది.
కాగా, జీహెచ్ఎంసీకి చెందిన నాలుగు కోర్ట్స్కు సంబంధించి ఉదయం పూట స్లాట్స్‌లో ఎప్పుడు చూసినా.. ఖాళీ లేవని చూపిస్తుంటుంది. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా పరిశీలన చేయగా, షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. జూబ్లీహిల్స్ టెన్నిస్ అకాడమీ పేరుతో ఇక్కడ ఓ ప్రైవేటు టెన్నిస్ కోచింగ్ సెంటర్ నడుస్తున్నట్లు తేలింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న పలువురు సంపన్నులు తమ పిల్లలను టెన్నిస్ అకాడమీలో చేర్చి శిక్షణ ఇప్పిస్తున్నట్లు వెల్లడైంది. ఒక్కో విద్యార్థి వద్ద టెన్నిస్ మిగతా IVవ పేజీలో
కోచింగ్ కోసం రూ. 5వేల నుంచి రూ. 10వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారని, జీహెచ్ఎంసీకి చెందిన టెన్నిస్ కోర్టులను ఆన్లైన్ ద్వారా ప్రైవేటు కోచ్‌లు బుక్ చేయిస్తున్నారని, ఆయా స్లాట్లలో ప్రైవేట్ కోచింగ్ పేరుతో నెలకు సుమారు 2 లక్షల దాకా గడిస్తున్నారని, అధికారుల అండదండలతో భారీ దందా నడుస్తున్నదని స్థానికులు తెలిపారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ విభాగం అధికారులకు నెలవారీ మామూళ్లు అందుతున్నందునే దర్జాగా బల్దియా గ్రౌండ్స్‌లో ప్రైవేటు కోచింగ్ సెంటర్ నడుస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక వెబ్సైట్లో ఎప్పుడు చూసినా స్లాట్స్ బుకింగ్ ఫుల్ అని చూపిస్తుండడంతో రూ.450 చెల్లించి రోజూ టెన్నిస్ ఆడుకోవాలనుకునే సాధారణ క్రీడాకారులకు అవకాశం లభ్యం కావడం లేదు. ఉదయం 10 నుంచి మద్యాహ్నం 2గంటల దాకా అయినా ఆడుకుందామని వారు ప్రయత్నిస్తే తాళాలు వేసి కనిపిస్తుందని పలువురు క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ టెన్నిస్ అకాడమీలో సుమారు 20 నుంచి 30 మంది పిల్లలు నెలవారీగా కోచింగ్ తీసుకుంటున్నారని, వీరితో పాటు కొంతమంది పెద్దలు నెలవారీగా రూ.10వేల చొప్పున ప్రైవేటు అకాడమీ కోచ్‌లకు చెల్లించడంతో పాటు మెయింటెనెన్స్ కింద మరికొంత మొత్తం కూడా ముట్టజెబుతున్నట్లు తేలింది. గూగుల్‌తో పాటు మరిన్ని వెబ్సైట్లు,యాప్స్‌లో జూబ్లీహిల్స్ టెన్నిస్ అకాడమీ పేరుతో జీహెచ్ఎంసీ టెన్నిస్ గ్రౌండ్ అడ్రస్‌తో ప్రకటనలు ఉండడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లు ఉండడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
జీహెచ్ఎంసీ ఖజానాకు చేరాల్సిన స్లాట్స్ సొమ్ముకు గండి కొట్టడంతో పాటు లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఏకంగా ప్రైవేటు టెన్నిస్ అకాడమీ పేరుతో టెన్నిస్ శిక్షణా కేంద్రాన్ని నడిపిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం వెనక మతలబు ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని, వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని వారు కోరుతున్నారు.