సిటీబ్యూరో, మార్చి 23(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర ప్రజలను మోసం చేస్తూ అక్రమ ద్రవ్య చెలామ ణి పథకాలను ప్రోత్సహిస్తున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ సిటీ పోలీస్‌కు చెందిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ప్రత్యేక బృందాలు మెరుపుదాడులు నిర్వహించాయని నగర సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ దాడులు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో ఏకకాలంలో నిర్వహించగా ఈ ఆపరేషన్‌లో 32 మంది నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. నిందితుల నుంచి భారీగా అగ్రిమెంట్ కాపీలు, ల్యాప్‌టాప్‌లు, పలురకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం బషీర్‌బాగ్ లోని సీసీఎస్ భవనలో జరిగిన విలేకరుల సమావేశంలో క్యూనెట్ మోసం చేస్తున్న తీరు, ప్రజలు ఎలా వారివలలో పడుతున్నారో, ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి నిరుద్యోగులను ఎలా లక్ష్యంగా చేసుకుని పిరమిడ్ ైస్టెల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో సవివరంగా సీపీ వెల్లడించారు. ఇటీవల గౌరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్ చదివి వినిపించారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు 30 బృందాలుగా విడిపోయి నిర్వహించిన అంతర్ర్రాష్ట్ర ఆపరేషన్‌లో 11మంది మహిళలతో సహా మొత్తం 32 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అరస్టైన వారిలో అత్యధికులు ఐటీ ఉద్యోగులేనని, ప్రస్తుతం నమోదైన నాలుగు కేసుల్లో 11మంది బాధితుల నుంచి సుమారు 75లక్షల రూపాయల నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలోనే మిగతావారిని కూడా పట్టుకుంటామన్నారు.
క్యూనెట్ గత ముప్పై ఏళ్లుగా ఇదే వ్యాపారంలో రకరకాల పేర్లతో కొనసాగుతు న్నదని, పోలీసులు గుర్తించి పట్టుకున్నప్పుడల్లా బయటకు రాగానే కొత్త పేర్లతో సమాజంలో చెలామణీ అవుతూ తమ మల్టీ లెవల్ వ్యాపారాన్ని కొనసాగిస్తుందని అన్నారు. గతంలో గోల్డ్‌క్వెస్ట్, క్వెస్ట్‌నెట్ అని పిలిచిన ఈ సంస్థ హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే క్యూఐ గ్రూప్‌కు చెందిన అనుబంధ సంస్థ ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడిందని తెలిపారు.
నిందితులు హైటెక్ సిటీలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కామర్స్ వ్యాపారం ,పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షిస్తారని, ఐదు నుంచి పది లక్షల పెట్టుబడి పెడితే రెండేళ్లలో మూడు నుంచి నాలుగుకోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పి నమ్మిస్తూ మోసం చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. వ్యాపారంలోకి దించే సమయంలో క్యూ నెట్ పేరు ఎక్కడా చెప్పరని, ఇది ఒక మల్టీ లెవల్ మార్కెటింగ్ లేదా బైనరీ పద్ధతి అని వెల్లడించారని తెలిపారు.
బాధితులు డబ్బులు చెల్లించిన తర్వాత వారి ప్రమేయం లేకుండానే ఆ మొత్తాన్ని వస్తువుల కొనుగోలుకు మళ్లిస్తారని, ఇంటికి వస్తువులు వచ్చినప్పుడు అవి కంపెనీ ఇచ్చిన బహుమతులని నమ్మిస్తూ అసలు పెట్టుబడిని పథకంలోకి మారుస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో 22 మంది బాధితులు చెప్పిన వివరాల మేరకు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. క్యూనెట్ కీలక ఆధారాల కోసం ముప్పై బృందాలతో కేసును ఛేదించామని, క్యూనెట్ సంస్థ చెప్పేది ఒకటని, చేసేది మరొకటంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక బాధితుడు సూసైడ్ నోట్ రాసి చనిపోయాడని సీపీ తెలిపారు.
వెల్నెస్ ప్రొడక్ట్స్, బిస్కెట్స్, హెల్త్ఫుడ్స్ తయారీ పేరిట ప్రజల్లోకి వెళ్తున్న క్యూనెట్ నిర్వాహకులు వారిని ట్రాప్ చేస్తూ ముగ్గులోకి దించుతున్నారని సజ్జనార్ అన్నారు. క్యూనెట్ సంస్థలో చేరే వ్యక్తులకు ముందు బాండ్ పేపర్లు ఇచ్చి తాము ఇష్టపూర్వకంగానే చేరుతున్నామని రాయించుకున్న తర్వాతే సంస్థలోకి తీసుకుంటున్నారన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితరచోట్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్లకు సైడ్ ప్రొడక్ట్స్ చూపించి సైడ్ ఇన్కమ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారని, ఉద్యోగస్తులు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే ప్రైవేటు ఫైనాన్స్ ద్వారా లోన్లు ఇప్పించి మరీ పెట్టుబడులు పెట్టించి అధిక వడ్డీలు వసూలు చేశారన్నారు.
చాలామంది ఇండియన్ డైరెక్ట్ సెల్లర్స్‌గా ఏర్పడి బిజినెస్ చేస్తున్నారని, డైరెక్ట్ ప్రొడక్ట్ సెల్లింగ్ పేరుతో మనీ స్కాంలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని , ఇలాంటి పథకాల్లో చేరడం, ఇతరులను చేర్పించడం చట్టరీత్యానేరమని, బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ శ్రీనివాసులు, డీసీపీలు చైతన్యకుమార్, శ్వేత, అరవింద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.