సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): మౌలాలి దర్గాలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హాసన్‌తో పాటు ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్ఈ రవీందర్ రాజు, జోనల్ కమిషనర్లతో మంగళవారం కలిసి కమిషనర్ దర్గా అభివృద్ధి పనులను పరిశీలించారు. జీహెచ్ఎంసీ ద్వారా దర్గా అభివృద్ధి పనులను రెండు దశల్లో చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. దర్గాకు వచ్చే భక్తుల దర్శనానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మొదటి దశలో చేపట్టిన రిటైనింగ్ వాల్‌తో పాటు రోడ్డు, మిడిల్ ల్యాండింగ్ వాహనాలను నిలిపేందుకు 1000 చదరపు మీటర్ల పార్కింగ్ పూర్తి చేశామని, రెండో దశలో రిటైనింగ్ వాల్‌తో పాటుగా రోడ్డు నిర్మాణానికి పనులు చేపట్టినట్లు , పనులు 50 శాతం పూర్తయ్యాయని, మిగతా 50 శాతం అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కాంట్రాక్టర్ సగం పనులు చేసి నిలిపివేశారని నిర్వాహకులు కమిషనర్‌కు తెలియజేశారు. అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయించాలని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు.
మల్కాజిగిరి: మౌలాలి గుట్టపై రెండో ర్యాంప్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గుట్టపై ర్యాంప్ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ రొనాల్ రాస్తో పాటు ఇంజనీరింగ్ విభాలకు సంబంధించిన అధికారులు పరిశీలించారు.